జగన్ కు రాజస్దాన్ షాక్-సీపీఎస్ రద్దు-వచ్చే ఏడాది నుంచి-వైసీపీపై మరింత ఒత్తిడి
ఏపీలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించి, ఇప్పుడు ఆలోచించకుండా ఆ హామీ ఇచ్చామంటూ చెబుతున్న వైసీపీ సర్కార్ కు రాజస్దాన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా ఉద్యోగుల నుంచి వచ్చిన వినతులతో సీపీఎస్ రద్దుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగబోతోంది. ముఖ్యంగా తాజాగా చర్చల్లో ఉద్యోగులకు సీపీఎస్ రద్దుపై నచ్చజెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు రాజస్తాన్ ప్రభుత్వ నిర్ణయం మింగుడుపడటం లేదు.

సీపీఎస్ రద్దు డిమాండ్
ఏపీతో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) అమలు చేయాలని గతంలో కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్రాలు ఆ బాటలో పయనించడం మొదలుపెట్టాయి. దీంతో రాష్ట్రాల్లో ఉద్యోగుల ఆందోళన పెరిగింది. తాము డబ్బు దాచుకుంటే తప్ప ప్రభుత్వం పెన్షన్ ఇవ్వలేని పరిస్ధితులపై ఉద్యోగులు ఆయా రాష్ట్రాల్లో గళం విప్పారు. ఫలితంగా చాలా రాష్ట్రాలు ఇరుకునపడ్డాయి. కేంద్రాన్ని ఆశ్రయించాయి. ఇప్పుడు రాష్ట్రాలు సీపీఎస్ రద్దు కేంద్రం చేతుల్లోనే ఉందని చెప్తుండగా.. కేంద్రం మాత్రం రాష్ట్రాల చేతుల్లోనే ఉందని చెబుతోంది. ఉద్యోగులకు బదులు రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ మొత్తం కడితే ఈ స్కీమ్ రద్దు చేసుకోవచ్చని కేంద్రం చెబుతోంది. దీంతో రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది.

జగన్ ఇచ్చిన హామీ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో సీపీఎస్ రద్దు కూడా ఒకటి. తాము అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ తన పాదయాత్రలో ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీంతో జగన్ హామీని నమ్మిన ఉద్యోగులు కీలకమైన ఈ హామీతో గంపగుత్తగా వైసీపీకి ఓట్లేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది.

సీపీఎస్ పై జగన్ యూటర్న్
సీపీఎస్ విధానం రద్దు విషయంలో ఉద్యోగుల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో వైసీపీ సర్కార్ ఇరుకునపడింది. ఏకంగా సీపీఎస్ పై యూటర్న్ తీసుకుంది. అప్పట్లో తెలియక హామీ ఇచ్చామంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగంగానే చెప్పేశారు. దీంతో ఇక ఏపీలో సీపీఎస్ రద్దు కావడం అసాధ్యమని తేలిపోయింది. అయినా ఉద్యోగులు మాత్రం సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉద్యోగుల తాజా పీఆర్సీ పోరులోనూ మూడు ప్రధాన డిమాండ్లలో సీపీఎస్ రద్దు కూడా ఒకటిగా నిలిచింది.

సీపీఎస్ రద్దు చేస్తున్నట్లు రాజస్ధాన్ ప్రకటన
ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ రద్దుపై మీనమేషాలు లెక్కిస్తున్న నేపథ్యంలో రాజస్తాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాజస్దాన్ అసెంబ్లీలో సీఎం అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి సీపీఎస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుందని ప్రకటించారు. దీంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అదే సమయంలో ఏపీ వంటి రాష్ట్రాల్లో ఉద్యోగుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
Recommended Video

జగన్ సర్కార్ కిం కర్తవ్యం ?
రాజస్తాన్ లో ఎన్నికల హామీ ఇవ్వకపోయినా సీపీఎస్ విధానం రద్దయిపోతోంది. దీంతో సహజంగానే ఏపీ వంటి రాష్ట్రాలపై ఒత్తిడి పెరగబోతోంది. రాజస్ధాన్ లో సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదనే డిమాండ్ ను ఉద్యోగులు తెరపైకి తీసుకురాబోతున్నారు. దీంతో వైసీపీ సర్కార్ కు ఇది ఇబ్బందికరంగా మారబోతోంది. ఇలాంటి పరిస్దితుల్లో సీపీఎస్ కు అయ్యే మొత్తాన్ని తామే భరించి ఈ స్కీమ్ ప్రభావం ఉద్యోగులపై పడకుండా చూడటం లేదా సీపీఎస్ స్దానంలో పాత పెన్షన్ విధానం అమలు చేయడం మాత్రమే ఇప్పుడు జగన్ సర్కార్ ముందున్న ఆప్షన్లు. వీటిలో ప్రభుత్వం దేన్ని ఎంచుకోబోతోందన్నది త్వరలో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications