Srisailam శివయ్య ప్రసాదం కూడా సురక్షితం కాదా? భక్తుల్లో ఆందోళన

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తిరుమలలో కల్తీ ప్రసాదం అంటూ జరిగిన ప్రచారం ఇప్పటికే కోట్లాది భక్తుల మనసులను గాయపరిచింది. "కలియుగ ప్రత్యక్ష దైవం"గా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి నైవేద్యమే ప్రశ్నార్థకమా? అనే చర్చ ఇంకా చల్లారక ముందే... ఇప్పుడు మరో ఆలయం పేరు తెరపైకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఈసారి ఆరోపణల నీడ పడింది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మీద. శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి క్షేత్రంలోనూ కల్తీ నెయ్యి సరఫరా జరిగిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారికంగా తేలాల్సి ఉన్న అంశాలే అయినా... బయటకు వస్తున్న వివరాలు చూస్తే భక్తులు మాత్రం "శివ శివ" అనక తప్పని పరిస్థితి.

After Tirumala Srisailam Under Cloud Allegations of Adulterated Ghee Supply Rock Telugu States

వైసీపీ పాలన సమయంలో తిరుమలతో పాటు శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి సరఫరా జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్... అదే నెట్‌వర్క్ శ్రీశైలం దేవస్థానాన్ని కూడా తాకినట్టు గుర్తించినట్లు సమాచారం. 2022 మే నుంచి 2023 మార్చి వరకు దాదాపు 11 నెలలపాటు కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.

విజయ డెయిరీని పక్కన పెట్టారు?

సాధారణంగా శ్రీశైలం దేవస్థానం ఎప్పుడూ నంద్యాల విజయ డెయిరీ నుంచే నెయ్యి కొనుగోలు చేసేది. కానీ ఆ 11 నెలల కాలంలో మాత్రం అనూహ్యంగా తిరుపతికి చెందిన రాజేశ్ కార్పొరేషన్ నుంచి 3 లక్షల 25 వేల కిలోల నెయ్యి కొనుగోలు చేసి, దాదాపు రూ.15.89 కోట్లను చెల్లించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.

రాజేశ్ కార్పొరేషన్ ద్వారా..

సిట్ ఇప్పటికే బయటపెట్టినట్టు... తిరుమలకూ సరఫరా చేసిన భోలేబాబా డెయిరీ నెయ్యి అసలు నెయ్యే కాదని, వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలు కలిపిన పదార్థమని నిర్ధారించింది. ఇప్పుడు అదే భోలేబాబా డెయిరీ ఉత్పత్తే రాజేశ్ కార్పొరేషన్ ద్వారా శ్రీశైలానికి చేరిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజేశ్ కార్పొరేషన్‌కు సొంత డెయిరీ లేదని, ఇతర సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసి సరఫరా చేస్తుందన్న విషయం ఈ ఆరోపణలకు మరింత బలం ఇస్తోంది.

అంతేకాదు... భోలేబాబా డెయిరీ తిరుపతిలోని పలు సంస్థల పేర్లతో కల్తీ నెయ్యిని మార్కెట్‌లోకి పంపినట్టు సిట్ దర్యాప్తులో తేలిన అంశం ఇప్పుడు శ్రీశైలానికి సంబంధించిన ఆరోపణలకూ లింక్ అవుతోంది. ఈ మొత్తం వ్యవహారం ఒక వ్యవస్థబద్ధమైన నెట్‌వర్క్‌గా పనిచేసిందా? అన్న ప్రశ్నలు రాజకీయంగా మరింత మంటలు రేపుతున్నాయి.

ట్రస్ట్‌ బోర్డు నిర్ణయం ఉన్నా..

ఇక మరో కీలక అంశం... విజయ డెయిరీని పక్కన పెట్టిన విధానం. పాల సొసైటీల ఆధ్వర్యంలో నడిచే డెయిరీల నుంచే నెయ్యి కొనాలన్న ట్రస్ట్‌ బోర్డు నిర్ణయం ఉన్నా, 2022లో ధరల విషయంలో దేవస్థానం అధికారులు.. విజయ డెయిరీ మధ్య విభేదాలు తలెత్తాయి. తక్కువ ధరకు సరఫరా చేయాలన్న ఒత్తిడిని విజయ డెయిరీ తిరస్కరించడంతో... అదే అవకాశంగా రాజేశ్ కార్పొరేషన్ రంగంలోకి వచ్చినట్టు ప్రచారం.

కిలో రూ.489కి నెయ్యి...

కిలో రూ.489కి నెయ్యి ఇస్తామన్న ఆఫర్‌తో కాంట్రాక్టు దక్కించుకున్న రాజేశ్ కార్పొరేషన్... వెనుక నుంచి కల్తీ నెయ్యిని సరఫరా చేసిందన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అప్పట్లో విజయ డెయిరీని వ్యూహాత్మకంగానే తప్పించారన్న వాదనకు ఈ పరిణామాలు బలం చేకూర్చుతున్నాయి. శ్రీశైలంలో రోజుకు లక్షకు పైగా లడ్డూలు విక్రయమవుతాయి. అలాంటి ఆలయంలో నైవేద్యానికి వాడే నెయ్యి స్వచ్ఛతపై సందేహాలు తలెత్తడం భక్తులను తీవ్రంగా కలచివేస్తోంది. 2023 ఏప్రిల్ నుంచి మళ్లీ విజయ డెయిరీ నుంచే నెయ్యి సరఫరా జరుగుతున్నా... గతంలో ఏమి జరిగిందన్న ప్రశ్నలు మాత్రం ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నలుగానే మిగిలాయి.

ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుంది? ఎవరి మెడకు తాళ్లు పడతాయి? దేవాలయాల పవిత్రతపై రాజకీయం ఎంత వరకు ఆడిందన్నది తేలాల్సి ఉంది. అప్పటివరకు మాత్రం కల్తీ నెయ్యి వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను, భక్తుల మనసులను కలిచివేస్తూనే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+