ఏపీలో గూగుల్ సహా 3 డేటా సెంటర్ల రాక..! ఈ పరిశ్రమలకు గుడ్ న్యూస్..!
విశాఖపట్నంలో దేశంలోనే తొలి ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తర్వాత రిలయన్స్, బ్రూక్ ఫీల్డ్ వంటి దిగ్గజాలు కూడా అదే బాట పట్టాయి. దీంతో రిలయన్స్, బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్లను రాష్ట్రంలోని ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాల్ని ప్రభుత్వం అన్వేషిస్తోంది. అదే సమయంలో ఈ మూడు డేటా సెంటర్ల రాకతో ఇతర పరిశ్రమలకు ఊతం లభించబోతోంది.
విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో గూగుల్ బాటలోనే డేటా సెంటర్ల ఏర్పాటుకు రిలయన్స్, బ్రూక్ ఫీల్డ్ వంటి సంస్థలు అంగీకరించాయి. దీంతో ఆయా సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. త్వరలోనే వీటి ఏర్పాటుకు అనువైన స్థలాల్ని చూపించి, కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో డేటా సెంటర్ల రాకతో తమ పరిశ్రమలకు ఊతం లభించబోతోందని పలు ఇతర సంస్థలు ప్రకటనలు చేస్తున్నాయి.

రాష్ట్రంలో మూడు డేటా సెంటర్ల ఏర్పాటుతో తమ ఉత్పత్తులకు డిమాండ్ పెరకబోతోందని పారిశ్రామిక దిగ్గజం కిర్లోస్కర్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు తాజా పరిణామాలలతో రాష్ట్రంలో తమ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయని కిర్లోస్కర్ సంస్థ ఎండీ అలోక్ ఎస్. కిర్లోస్కర్ ప్రకటించారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిన సంస్థలు.. త్వరలో వీటిని గ్రౌండ్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నాయి. వీటి ఆధారంగా తమ ఉత్పత్తుల డిమాండ్ పై క్లారిటీ వస్తుందని, అప్పుడు నేరుగా పైప్ ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలా లేక సర్వీస్ సెంటర్లు పెట్టాలా అన్నది నిర్ణయిస్తామని ఆయన వెల్లడించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఆ తర్వాత విభజన ఏపీలోనూ ఇప్పటికే పలు సాగునీటి ప్రాజెక్టులకు కిర్లోస్కర్ సంస్థ పైపులు సరఫరా చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు తర్వాత వాటికి వాడే భారీ పైపులైన్లను సరఫరా చేసేందుకు కిర్లోస్కర్ సంస్థ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికే మన దేశంలో మధ్యప్రదేశ్, గుజరాత్, కోయంబత్తూరు, అమెరికా, బ్రిటన్ లోనూ కిర్లోస్కర్ సంస్థకు పైపుల తయారీ పరిశ్రమలున్నాయి. ఇప్పుడు ఏపీలో డేటా సెంటర్ల రాకతో వాటికి పైపులైన్ల తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కిర్లోస్కర్ ప్లాన్ చేస్తోంది. అలాగే డేటా సెంటర్ల ఇతర అవసరాలను తీర్చేందుకు అనుబంధ పరిశ్రమలు కూడా రంగం సిద్దం చేసుకుంటున్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటు మొదలైతే వీటిపై క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications