ఏపీ, తెలంగాణా ప్రజలకు మరో అలెర్ట్ .. విపరీతంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు, వడగాలులు
ఒకపక్క కరోనా మహమ్మారి తో విలవిలలాడుతున్న తెలుగు రాష్ట్రాలకు రానున్న రోజుల్లో మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాలలో ఎండలు విపరీతంగా మండిపోతాయని వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈరోజు నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో వడగాలులు పెరగనున్నాయని, తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు .
ఈ ఏడాది రోళ్ళు పగిలే ఎండలు .. ఐఎండీ నివేదిక ఇప్పుడే చెమటలు పట్టిస్తుందిగా !!
ఈ రోజు ప్రారంభమైన వడగాలులు రేపు మరింత ఉధృతరూపం దాలుస్తాయి అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పలు ప్రాంతాలలో ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతల పై 4 నుండి 6 డిగ్రీల వరకు అదనంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు . తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ , మంచిర్యాల జిల్లాలపై వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం ఉభయ గోదావరి జిల్లాల పై వడగాలుల ప్రభావం ఉంది.

వాయువ్య దిశ నుండి వీస్తున్న గాలులే దీనికి కారణమని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎండలు మొదలుకాక ముందే , ఇప్పటి నుండే వడగాలులు ప్రజలను భయపెడుతున్నాయి. ముందు ముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అన్న భావనకు కారణమవుతున్నాయి.
ఈసారి వేసవికాలంలో ఎండలు దంచికొట్టనున్నాయని, ఈ సమ్మర్ చాలా హాట్ గా ఉంటుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది.