పవన్ కల్యాణ్, అలీ మధ్య చిగురించిన స్నేహం?
కొంతకాలం నుంచి ఎడముఖం పెడముఖంగా ఉంటున్న జనసేనాని పవన్ కల్యాణ్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అలీ మధ్య స్నేహం మరోసారి చిగురించింది. మొదటి నుంచి పవన్ కల్యాణ్ ప్రతి సినిమాలో తప్పనిసరిగా అలీకి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది సెంటిమెంట్ అని పవన్ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. పవన్ కు అలీ అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి భిన్న ధ్రువాలుగా ఉన్నారు. జనసేనానిగా పవన్ ఉండగా, అలీ వైసీపీలో ఉన్నారు.
పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో ఎందుకు చేరలేదని అలీని ప్రశ్నించగా ఆయన పవన్ ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది జన సైనికులకు ఆగ్రహం తెప్పించింది. పవన్ సైతం అప్పటి నుంచి తన సినిమాల్లో అలీకి అవకాశం కల్పించలేదు. ఓ ఇంటర్వ్యూలో ఎవరు స్నేహితులో? ఎవరిని నమ్మాలో అర్థం కావడంలేదని పవన్ పరోక్షంగా అలీగురించి వ్యాఖ్యానించారు. అలీ కుమార్తె వివాహానికి పవన్ ను ఆయన స్వయంగా ఆహ్వానించారు. విమానం రాకపోవడంవల్ల పవన్ హాజరుకాలేకపోయారు.

సినిమాల విషయానికొస్తే సుజిత్ దర్శకత్వంలో పవన్ ఓజీ చేస్తున్నారు. ఈ సినిమాలో అలీ నటిస్తున్నారు. త్వరలోనే ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్ లో వీరిద్దరి మధ్య సన్నివేశాలుంటాయని ఫిల్మ్ నగర్ లో వార్త గుప్పుమంది. దీనిపై పవన్ కానీ, అలీకానీ, ఓజీ సినిమా యూనిట్ కానీ స్పందించకపోవడంతో నిజమేనని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. నిర్మాత డీవీవీ దానయ్య. డిసెంబరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన బ్రో సినిమా జులై 28వ తేదీన విడుదల కాబోతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications