ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు బిగ్ షాక్..టీడీపీ - జనసేనలో నో టికెట్..?
Raghurama krishnam raju:వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు గట్టి షాకే తగిలినట్టు తెలుస్తోంది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి ఏ పార్టీ ముందుకు రావడం లేదని సమాచారం. 2019 ఎన్నికల్లో రఘురామ కృష్ణం రాజు వైసీపీ తరుఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరం అయ్యారు. కొన్నిసందర్భాల్లో ఏకంగా సీఎం జగన్‌పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారాయన.
పార్టీలోనే ఉంటూ జగన్ మీద విమర్శలు చేయడంతో పార్లమెంట్ స్పీకర్‌కు రఘురామపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఇదే సమయంలో రఘురామ కృష్ణంరాజు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ సైతం రఘురామ విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్లలేకపోయింది. నియోజకవర్గానికి మూడేళ్లకు దూరంగా ఉన్న రఘురామ ..ఢిల్లీలోనే ఉంటూ తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారాయన. ప్రస్తుతం ఆయన టీడీపీ- జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రఘురామ పరిస్థితి మరీ కష్టంగా కనిపిస్తోంది . ఆయన ఈ సారి టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా టీడీపీ- జనసేన కూటమితో కలిసి వస్తుందని ఆశలు పెట్టుకున్న రఘురామ రాజుకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని తెలుస్తోంది.
టీడీపీ- జనసేన కూటమితో కలిసి నడించేందుకు బీజేపీ సిద్ధంగా లేదని సమాచారం. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయలని చూస్తున్న రఘురామ రాజుకు ఇది మింగుడు పడని విషయమే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.అటు కూటమితో బీజేపీ కలిసి రాకుంటే రఘురామ రాజుకు టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదట.కూటమితో కలిసి వేళ్లే విషయంలో బీజేపీ స్టాండ్ క్లారిటీగా ఉండటంతో.. రఘురామ రాజుకు టీడీపీ-జనసేన టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం.
పైగా రఘురామ రాజుపై నెగిటివ్ రిపోర్టులు రావడంతోనే టీడీపీ-జనసేన కూటమి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రఘురామ రాజు వెంటనే బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఢిల్లీ పెద్దలు సైతం రఘురామ రాజుకు గట్టి షాకే ఇచ్చినట్టు తెలుస్తోంది.టీడీపీ-జనసేన పార్టీలతో పొత్తుతో వెళ్లేందుకు ఇష్టపడని బీజేపీ నాయకులు..వారితో సంబంధం ఉన్న రఘురామ రాజుకు టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారట.

టీడీపీ-జనసేన కూటమి టికెట్ నిరాకరించడం,అటు బీజేపీ సైతం మొండి చేయి చూపించడంతో దాదాపు అన్ని పార్టీల్లోనూ రఘురామ రాజుకు డోర్స్ క్లోజ్ అయినట్టే అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబును నమ్మినందుకే రఘురామకు ఈ గతి పట్టిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఆయన వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చేస్తే తప్ప ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications