మూడ్రోజుల్లో రాష్ట్రపతికి టి: ఢిల్లీబాట, బిజెపి ఏంచేస్తుంది?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేర రావు శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నారు. తెలంగాణతోనే తాను తిరిగి వస్తానని చెప్పారు. సీమాంధ్ర టిడిపి నేతలు కూడా శుక్రవారమే ఢిల్లీకి వెళ్లనున్నట్టు ప్రకటించారు. విభజన బిల్లు ఢిల్లీకి చేరనుండటంతో అక్కడికి వెళ్లి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని సీమాంధ్ర టిడిపి నేతలు నిర్ణయించారు. సీమాంధ్ర టిడిపి నేతలు గురువారం సాయంత్రం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఢిల్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో వ్యూహాన్ని ఖరారు చేసినట్టు వారు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, కాంగ్రెసు సీనియర్ నాయకుడు జానారెడ్డి నేతృత్వంలో తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లి, పార్లమెంట్‌లో బిల్లును త్వరతగతిన పెట్టడానికి పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని తెలంగాణ మంత్రులు నిర్ణయించారు. వారు మూడో తేదిన వెళ్లే అవకాశముంది.
శాసన సభ ప్రక్రియ ముగిసిందని, ఇక్కడ తెలంగాణ బిల్లును తిరస్కరించి పంపించామని, ఇక పార్లమెంటులో కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులే బిల్లును అడ్డుకోవాలని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు సూచించారు. మరోవైపు, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టేందుకు కేంద్రం ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందనే ఆసక్తి అందరిలోను ఉంది.
సీమాంధ్ర ప్రాంతానికి నష్టం చేసేలా బిల్లు ఉంటే బిజెపి దానికి మద్దతు పలకకపోవచ్చునని పలువురు చెబుతున్నారు. అయితే, బిజెపి మాత్రం తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కేంద్రం బిల్లు పెడితే బిజెపి దానిని ఆమోదిస్తూనే.. సీమాంధ్రకు కావాల్సిన అంశాలను ప్రతిపాదించే అవకాశముంది. అప్పుడు ఇరు ప్రాంతాల్లో తమ పార్టీకి క్రెడిబిలిటీ ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణకు మద్దతివ్వడంతో పాటు సీమాంధ్ర ప్రయోజనాల కోసం సూచనలు చేశామని చెప్పుకునే అవకాశముంటుంది.












Click it and Unblock the Notifications