Hindu Mahasabha: జగన్ పై మతం కోణంలో దాడి: హిందుత్వానికి పెను ముప్పు: బరిలో దిగిన హిందూ మహాసభ..!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మతం కోణంలో దాడి ఆరంభమైంది. దీనికోసం హిందూ మహాసభ బరిలోకి దిగింది. వైఎస్ జగన్, ఆయన అనుసరిస్తోన్న మతాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలను సంధిస్తోంది. ఈ నెల 20వ తేదీన విజయవాడలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభను దృష్టిలో ఉంచుకుని సన్నాహాక సమావేశాలను చేపట్టింది. రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఆ సంస్థ రాష్ట్ర ఇన్ ఛార్జి, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్.
అమరావతి రైతులకు మద్దతుగా..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ఇదివరకే వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని హిందూ మహాసభ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అభివృద్ధిని వికేంద్రీకరించాలే తప్ప అధికారాన్ని కాదని జంధ్యాల రవిశంకర్ విమర్శిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. రోడ్ షోలను నిర్వహించారు. సమావేశాలను ఏర్పాటు చేశారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
యథేచ్ఛగా మత మార్పిళ్లు..
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో హిందుత్వానికి పెను ప్రమాదం ముంచుకొచ్చిందని, మత మార్పిళ్లు ఇష్టానుసారంగా కొనసాగుతున్నాయని జంధ్యాల రవిశంకర్ విమర్శించారు. అమరావతి హిందువుల రాజధాని అని, హిందువులకు అక్కడ రాజధానిగా ఉండటం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదా? అంటూ ఆయన ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. హిందువుల రాజధాని కావడం వల్లే అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు.

జగన్ మతమేంటీ?
వైఎస్ జగన్ తన మతమేమిటనే అంశాన్ని ప్రజలకు కూలంకషంగా వివరించాలని జంధ్యాల రవిశంకర్ డిమాండ్ చేశారు. తన మతం ఏమిటనేది వైఎస్ జగన్ ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి హిందువు కూడా తన మతం గురించి గొప్పగా చెప్పుకొంటాడని, జగన్ అలాంటి పని ఎందుకు చేయట్లేదని నిలదీశారు. తిరుమల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో హిందువుల మనోభావాలు గాయపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యతిరేక విధానాలను సహించబోం..
హిందూ వ్యతిరేక విధానాలు తీసుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాలను ఇకపై తాము చూస్తూ సహించబోమని జంధ్యాల రవిశంకర్ హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ త్వరలో 20 వేలమంది హిందువులతో అమరావతి ప్రాంతంలో ర్యాలీని నిర్వహించబోతున్నామని చెప్పారు. దీనిపై హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications