నేనే సీఎం: జగన్‌కు అఖిలప్రియ బెస్టఫ్ లక్, వైసిపి ఉండదని కళా ఫైర్
విజయవాడ/కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబానికి మంచి జరగాలని తాను, తన తండ్రి భూమా నాగిరెడ్డి కోరుకుంటామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆదివారం తెలిపారు. ఆమె ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
కార్యకర్తల కోరిక, అభివృద్ధి కోసమే తాము పార్టీ మారామన్నారు. రాష్ట్రానికి తానే కాబోయే ముఖ్యమంత్రినని జగన్ చెప్పుకుంటారని, పార్టీ మారిన మీరు జగన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతారా? అని ప్రశ్నించగా.. తప్పకుండా చెబుతానన్నారు. వాళ్ల మంచిని మేం కోరుకుంటున్నామన్నారు.
2019 ఎన్నికల నాటికి వైసిపి ఉండదు: పత్తిపాటి
2019 సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండదని మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదివారం అన్నారు. మార్చి 5 లోపు చాలామంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని చెప్పారు. మరి కొంతమంది సంప్రదింపుల్లో ఉన్నారనాన్నరు.

వైసిపిని ఏ పార్టీలో విలీనం చేయాలా అని జగన్ ఆలోచిస్తున్నారన్నారు. ఏపీలో ప్రతిపక్షం అన్న పదం కూడా వినపడని, ఆ రోజు త్వరలో రానుందన్నారు. తన పార్టీని మరో పార్టీలో విలీనం చేయడం మినహా జగన్‌కు మరో అవకాశం లేకుండా పోతుందన్నారు. ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగానే తమ పార్టీలోకి వస్తున్నారే తప్ప తామెలాంటి ప్రలోభాలకూ గురి చేయడం లేదన్నారు.
ఎవరినైనా చేర్చుకుంటాం: కళా
అభివృద్ధి, సంక్షేమం కోసం కలిసి వస్తే తాము ఎవరినైనా పార్టీలో చేర్చుకుంటామని తెలంగాణ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. వైసిపి ఎమ్మెల్యే డేవిడ్ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కళా మాట్లాడారు.
జగన్ ప్రవర్తనతో వైసిపి ఎమ్మెల్యేలు విసిగెత్తి పోతున్నారన్నారు. వైసిపికి దిశా నిర్దేశనం లేదన్నారు. పదేపదే ఉప ఎన్నికలు రాష్ట్రానికి నష్టమని చెప్పారు. తమకు ప్రజలు అయిదేళ్ల పాటు అవకాశం ఇచ్చారని, ప్రతిపక్ష నేతగా జగన్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications