మార్పు రాలేదా, 'ఫోటో' దెబ్బ: విజయసాయికి కూడా జగన్ పక్కన కూర్చునే అర్హత లేదా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఆ పార్టీని ఇరుకున పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఆ పార్టీని ఇరుకున పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
వైసిపి నుంచి బయటకు వచ్చిన చాలామంది నేతలు జగన్ తీరుపై మండిపడ్డారు. జగన్ ఒంటెత్తు పోకడతో వెళ్తున్నారని, సీనియర్ల మాటలు వినరని, ఆయన ఏం చెబితే అదేనని విమర్శలు చేశారు. ఆ మాటలు నిజమయ్యేలా ఫోటో వైరల్ అవుతోందంటున్నారు.

విశాఖ పర్యటన ఫోటో దుమారం
తన మాట ఎదుటివారు వినాల్సిందే తప్ప, తానెవరి మాట వినరని, సీనియర్లను గౌరవించరన్న ప్రచారం ఉన్న జగన్.. ఇటీవలి విశాఖ పర్యటనలో ప్రయాణించిన విమానం ఫొటో ఒకటి, ఆయన నైజానికి అద్దం పట్టిందని విమర్శిస్తున్నారు.

మధ్యలో ఖాళీ ఉంచి..
విమానంలో ఆయన పక్క సీటు ఖాళీగా ఉండగా, తర్వాత సీటులో పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఉన్నారు. మధ్యలో ఉన్న సీటులో నీళ్ల బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు కనిపించాయి. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. విశాఖ సేవ్ ఆందోళనలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయనను అడ్డుకుని, పోలీసులు వెనక్కి పంపించారు. ఆ విమానంలో జగన్ పక్కనే ఉన్న సీటులో విజయ సాయి రెడ్డిని కాకుండా మధ్య ఖాళీ ఉంచి, అవతల సీటులో సీటు ఇచ్చిన ఫొటోపై నెటిజన్లు విపరీతమైన కామెంట్లు పెడుతున్నారు.

జగన్ పక్కన కూర్చునే అర్హత ఎవరికీ లేదా?
జగన్‌లో మార్పు వచ్చిందనడం ఉత్తిమాటేనని, అది ఆయనకు సహజంగా వచ్చిన లక్షణమని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఆయన పక్కన ఎవరికీ కూర్చునే అర్హత లేదా? జగన్ పక్కన విజయసాయి రెడ్డికి కూర్చునే అర్హత లేదా? సొంత పార్టీ ఎంపీనే గౌరవించలేని జగన్, ఇక రేపు గెలిచాక ప్రజలను ఏం గౌరవిస్తారన్న ప్రశ్నలు సంధించారు. ఇది జగన్ నియంతృత్వ విపరీత పోకడలకు నిదర్శనమని కొందరు వ్యాఖ్యానిస్తే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాజరికంలో ఉన్నామా? అని మరికొందరు ప్రశ్నించారు.

జగన్‌కు దెబ్బే అంటూ..
సొంత పార్టీ నాయకులను గౌరవించలేని నాయకుడు ప్రజలను గౌరవిస్తారని ఆశించడం భ్రమేనని మరికొందరు వ్యాఖ్యానించారు. సొంత పార్టీ ఎంపినే పక్కన కూర్చోబెట్టుకునే పెద్ద మనసు, రాజకీయ విశాల దృక్పథం లేని జగన్, రేపు గెలిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలను ఏ స్ధాయిలో చూస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా వైసిపిని, జగన్ ఇమేజ్‌ను వ్యక్తిగతంగా దెబ్బతీసినట్లేనని అంటున్నారు.

విమర్శలపై ఇలా..
ఇదిలా ఉండగా, ఈ ఫోటోపై విమర్శలు రావడాన్ని కొందరు ఖండిస్తున్నారు. ఎవరైనా ఇద్దరు ప్రయాణిస్తున్నప్పుడు.. మూడు సీట్లు బుక్ చేసుకున్నప్పుడు.. ఇరువురికి అందుబాటులో ఉండేలా మధ్యలోనే ఏ పదార్థాన్ని అయినా పెట్టుకుంటారని, ఈ ఫోటోపై విమర్శలు విడ్డూరమంటున్నారు. ప్రయాణంలో పార్టీ వ్యవహారాలు చర్చించేందుకు మూడు సీట్లు బుక్ చేసుకొని ఉండవచ్చునని, ఆ సమయంలో మధ్యలో తినే పదార్థాలు పెట్టుకొని ఉండవచ్చునని అంటున్నారు.


Click it and Unblock the Notifications