అమరావతిని రెండేళ్లు మోసేదెలా ? విపక్షాలకు సవాల్ ! వైసీపీ పవర్ పాలిటిక్స్ తట్టుకోగలరా ?
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానులుగా మారిన రాజకీయంలో ఇప్పుడు ఎవరెక్కడ అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అమరావతి రాజధానిగా ఉంటే విపక్షాలు గెలిచినట్లు, మూడు రాజధానులు అమల్లోకి వస్తే వైసీపీ గెలిచినట్లు అనేలా పరిస్దితులు మారుతున్నాయి. దీంతో విపక్షాలను ఇప్పటివరకూ వెనక్కి నెట్టిన వైసీపీ తమ పవర్ పాలిటిక్స్ కు పదునుపెడుతోంది. అదే సమయంలో మరో రెండేళ్ల పాటు అంటే ఎన్నికల వరకూ అమరావతి అజెండాను ముందుకు తీసుకెళ్లడం విపక్షాలకు కూడాసవాల్ గా మారుతోంది.

అమరావతి వర్సెస్ రాజధానులు
ఏపీలో అమరావతి వర్సెస్ రాజధానుల పోరు ముదిరింది. ఓవైపు అమరావతి రైతులు సాగిస్తున్న పాదయాత్ర, దానికి విపక్షాలు అందిస్తున్న మద్దతు.. మరోవైపు మూడు రాజధానుల సాధన దిశగా వైసీపీ వేస్తున్న అడుగులు,దానికి విశాఖ కేంద్రబిందువుగా మారుతున్న తీరు. ఇదంతా చూస్తుంటే అమరావతి వర్సెస్ రాజధానుల పోరు రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటే వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు కూడా ఎన్నికల నాటికి తీవ్రంగా మారుతుందన్న అంచనాలు వచ్చేస్తున్నాయి. అదే సమయంలో కచ్చితంగా ఈ పోరు ఏపీ పాలిటిక్స్ ను మరో స్ధాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది.

విపక్షాలకు అమరావతి పెను సవాల్
అమరావతికి అండగా నిలుస్తూ వైసీపీ సర్కార్ మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలకు ఈ పోరు సవాల్ గా మారుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో 2019 తర్వాత మారిన పరిస్దితుల్లో ప్రజాప్రతినిధుల్ని భారీగా కోల్పోయిన విపక్షాలు ఇప్పుడు అన్ని చోట్లా వెనుకబడుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన విపక్షం టీడీపీ అయితే కేవలం 23 ఎమ్మెల్యేలతోనే పోరాడాల్సిన పరిస్దితి. ఇందులోనూ ఓ నలుగురు వైసీపీకి ఫిరాయించేయడంతో మిగిలిన 19 మందిలో అందులోనూ చంద్రబాబు మినహా 18 మందితోనే రోడ్లపై పోరాటం చేయాల్సిన పరిస్దితి. బీజేపీ, జనసేనకు అయితే ఆ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా లేకపోవడంతో నియోజకవర్గాల్లో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి.

అమరావతిని రెండేళ్లు మోసేదెలా ?
ఇప్పటికే ఓ దశకు చేరిన అమరావతి ఉద్యమాన్ని మరో రెండేళ్ల పాటు మోయాల్సిన పరిస్ధితి విపక్షాలది. లేకపోతే కాడి పడేసిన చందాన విమర్శలు తప్పవు. అదే సమయంలో వైసీపీ మూడు రాజధానుల కోసం చేస్తున్న ప్రయత్నాల్ని తట్టుకుంటూ అమరావతిపై ఇతర ప్రాంతాల జనాన్ని ఒప్పించడం విపక్షాలకు ఇబ్బందిరకంగా మారింది. ముఖ్యంగా విశాఖలో రాజధాని వద్దంటూ ఉత్తరాంధ్ర ప్రజల్ని ఒప్పించడం అంత సులువు కాదు. అలాగే కర్నూల్లో హైకోర్టు వద్దని రాయలసీమ ప్రజల్ని ఒప్పించలేరు. దీంతో ఇప్పుడు అమరావతి ఉద్యమాన్ని కూడా పూర్తిస్దాయిలో తెలంగాణ ఉద్యమం తరహాలో రగిలిస్తే తప్ప దీంతో ఆశిస్తున్న ప్రయోజనం విపక్షాలకు ఒనగూడేలా లేదు. దీంతో విపక్షాలకు ఇదో సంకటంగా మారింది.

వైసీపీ పవర్ పాలిటిక్స్ తట్టుకుంటారా ?
అన్నింటికంటే మించి వైసీపీ ఈ మూడేళ్లుగా సాగిస్తున్న పవర్ పాలిటిక్స్ కచ్చితంగా విపక్షాలకు శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా తమపై పోలీసులు పెడుతున్న కేసులు, వైసీపీ నేతల దాడుల్ని తట్టుకుంటూ ఈ మూడేళ్లలో యాక్టివ్ గా ఉన్న విపక్ష నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టేలా ఉంది. ఇప్పటికీ గడప దాటని విపక్ష మాజీ ఎమ్మెల్యేలు, మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఎందరో ఉన్నారు. వీరికి టికెట్లు ఇవ్వబోమనే హెచ్చరికలతో చంద్రబాబు యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పడుతుందనే భయం వారిని వెంటాడుతోంది. అదే సమయంలో నిధుల కొరత కూడా వారిని వెంటాడుతోంది. అటు వైసీపీ నేతలు మాత్రం అధికారం అండతో అర్ధ బలం, అంగబలం కూడా ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తారన్న దానిపైనే అమరావతి ఉద్యమమైనా, 2024 ఎన్నికల ఫలితాలు అయినా ఆధారపడతాయి.












Click it and Unblock the Notifications