జోరువానలోనూ రాజధాని రైతుల మహా పాదయాత్ర .. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు, అమరావతి జేఏసి ఆగ్రహం!!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన ఉదృతం చేశారు. వివిధ జిల్లాల ప్రజల మద్దతు కోసం న్యాయస్థానం టూ తిరుమల తిరుపతి దేవస్థానం అంటూ అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈరోజు అమరావతి రైతు మహా పాదయాత్ర పదకొండో రోజుకు చేరుకుంది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అంటూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర నేడు ప్రకాశం జిల్లాలో జోరున కురుస్తున్న వర్షంలోనూ కొనసాగుతుంది.

వర్షంలోనూ సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర
నవంబర్ 11 న గురువారం నాడు పదకొండో రోజు ప్రారంభమైన మహా పాదయాత్ర ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో మొదలైంది. నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు 11వ రోజు వర్షం లోనే రాజధాని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు తమ పాదయాత్రను ప్రారంభించారు. వర్షం పడుతున్న కారణంగా గొడుగులు, రెయిన్ కోట్లతో రైతులు ముందుకు సాగుతున్నారు.

రైతుల పాదయాత్రలో పాల్గొనకుండా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు
అమరావతి రైతుల మహా పాదయాత్ర లో పాల్గొనకుండా ప్రకాశం జిల్లాలో టిడిపి నేతలపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలను పోలీసులు ఇప్పటికే గృహనిర్బంధం చేశారు. చిలకలూరిపేట లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మార్టూరులో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ను గృహ నిర్బంధం చేశారు. సంత నూతలపాడు లో మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ను గృహ నిర్బంధం చేశారు.

చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి పాదయాత్రకు సంఘీభావం తెలిపే వారి అడ్డగింత
ఇక నాగులుప్పాడులో పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు సంఘీభావం తెలపడానికి వస్తున్న ప్రజలను పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ అడ్డుకుంటున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు చేస్తున్న పాదయాత్రకు ఇతర పార్టీల నాయకులు సంఘీభావం తెలపడానికి వీల్లేదని, రాజకీయ పార్టీల నాయకులు పాదయాత్రలో పాల్గొనకూడదని, లౌడ్ స్పీకర్లు, మైకులు పెట్టకూడదని, పాదయాత్రకు అనుమతి కోరిన రైతులు మాత్రమే పాదయాత్రను కొనసాగించాలని ఇలా అనేక నిబంధనలు పెట్టిన ఏపీ పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేస్తామని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే రైతులకు నోటీసులు కూడా అందజేశారు.

పోలీసుల తీరుపై అమరావతి జేఏసి ఆగ్రహం
ఈ క్రమంలో రైతులు కావాలనే రాజధాని అమరావతి రైతులను ఇబ్బంది పెట్టేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . మొదటి నుండి పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసుల ఆంక్షల నడుమ న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పోలీసులు కూడా రైతుల పాదయాత్ర సరళిని వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి రాజధాని ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 45 రోజుల పాదయాత్ర గుంటూరు, ప్రకాశం ,నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగనుంది. ఈ యాత్ర డిసెంబర్ 15వ తేదీన తిరుపతిలో ముగియనుంది. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుని ఆ వెంకన్నకు రాజధాని అమరావతి రైతులు తమ గోడు విన్నవించుకోనున్నారు.

బుధవారం రాత్రి నాగులుప్పాడులో వర్షం కారణంగా ఇబ్బంది పడిన రైతులు
పదవరోజు రాత్రి రైతులు నాగులుప్పాడులో బస చేసిన విషయం తెలిసిందే. నాగులుప్పాడు లో గుడారాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వర్షాల కారణంగా గుడారాలు తడిసి పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈ రోజు వర్షంలోనూ రైతులు తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. సేవ్ అమరావతి అంటూ నినదిస్తున్నారు .రాష్ట్ర రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు .అమరావతి పరిరక్షణ కోసం, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడం లక్ష్యంగా మహా పాదయాత్ర కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications