'అమరావతి' యుద్ధం: జగన్ చిక్కుల్లో పడతారా, బాబు జైలుకెళ్తారా?
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని వైసిపి నేతలు, సాక్షి పత్రిక చేసిన ఆరోపణల పైన తెలుగుదేశం పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. టిడిపి, వైసిపి నేతల మధ్య 'రాజధాని యుద్ధం' సాగుతోంది.
వైసిపి నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు రోజా, రాజేంద్ర తదితరులు చంద్రబాబు, టిడిపి నేతల పైన దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, కేంద్రమంత్రి సుజనా చౌదరి, టిడిపి నేత పయ్యావుల తదితరుల పైన వైసిపి నేతలు ఆరోపించారు.
దీంతో వారు ఎదురుదాడికి దిగారు. తమకు రాజధాని ప్రాంతంలో భూమి లేదని, తమకు బినామీలు లేరని పత్తిపాటి, నారాయణ తదితరులు స్పందించారు. మంత్రి దేవినేని ఉమ కూడా.. తనకు రాజధాని ప్రాంతంలో భూమి లేదన్నారు.

పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... జగన్ పైన దుమ్మెత్తిపోశారు. తాను తన కొడుకు పేరు మీద మగాడిలా కొన్నానని చెప్పారు. రాజధాని ప్రకటన అసెంబ్లీలోనే సెప్టెంబర్ నెలలో చేశారని, ఆ తర్వాత ఒకటి రెండు నెలల తర్వాత తాను కొన్నానని చెప్పారు.
తమ పైన జగన్, వైసిపి ఎన్ని చెప్పిన కక్ష సాధింపు చర్యలు వద్దని ఊరుకున్నామని, ఇక ఊరుకునేది లేదని చెప్పారు. జగన్ బినామీల పేర్లు బయటకు తీస్తామని టిడిపి నేతలు హెచ్చరించారు. ఆయనకు చాలామంది బినామీలు ఉన్నారని, వాటిని బయటపెడతామని, మరింత చిక్కుల్లో జగన్ పడతారని అభిప్రాయపడ్డారు.
రావెల మాట్లాడుతూ... జగన్ పార్టీది మునిగిపోయే నావ అని, ఆయన పత్రిక సాక్షిలో పిచ్చి రాతలు రాయిస్తున్నారని, ప్రజలు జగన్‌ను ఛీకొడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ నాశనం అవుతుందనే భయంతోనే తమ పైన ఇష్టారీతిన రాయిస్తున్నారన్నారు.
మరోవైపు, వైసిపి నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. మంత్రి నారాయణ మొదట.. మునిశేఖర్, ప్రవీణ ఎవరో చెప్పాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేస్తున్నారు. రాజధానిలో లక్ష కోట్ల కుంభకోణం జరుగుతోందని, చంద్రబాబు, టిడిపి నేతలు జైలులో చిప్పకూడు తినే రోజులు వస్తాయని మండిపడుతున్నారు.
పేర్లతో సహా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు వాళ్లు నిజాయితీ నిరూపించుకోవాలని రోజా సవాల్ చేస్తున్నారు. మరో ఎమ్మెల్యే రాజేంద్ర మాట్లాడుతూ.. రాజధాని కోసం త్యాగాలు చేయాలని టిడిపి నేతలు రైతులకు చెప్పారని, అదే ప్రాంతంలో వారు భూములు ఎలా కొనుక్కున్నారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications