నేడే సీమలో అమరావతి సభ: చంద్రబాబు తో సహా ప్రముఖుల హాజరు: కొత్త సమీకరణాలకు వేదికగా..!!
ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు (శుక్రవారం) తిరుపతిలో మహోద్యమ సభ జరగనుంది. కోర్టు అనుమతులు - ఆంక్షల నడుమ ఈ సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసి ఈ రోజుతో రెండేళ్లు పూర్తవుతోంది. ఆ ప్రకటన చేసిన సమయం నుంచి ఇప్పటి వరకు అమరావతి రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తిరుపతి రూరల్ మండలం దామినీడు సమీపంలో గజలక్ష్మీ గ్రీన్ సిటీ దగ్గర పది ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఖరారు చేశారు.
Recommended Video

తిరుపతి వేదికగా అమరావతి సభ
మరో పది ఎకరాల్లో వాహనాలకు పార్కింగ్, 5ఎకరాలు ఫుడ్ కోర్టు కోసం కేటాయించారు. 30వేల మందికి పైగా సరిపడా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. సభలో 25వేల కుర్చీలు, లక్షన్నర వాటర్‌బాటిళ్లు అందుబాటులో ఉంచుతున్నారు. జేఏసీ నేతలు, ముఖ్యనేతలు ఆశీనులయ్యే వేదికను వందమందికి సరిపోయేలా సిద్ధంచేస్తున్నారు. అమరావతికి మద్దతుగా ఆ ప్రాంత రైతులు నవంబర్ 1న న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర ప్రారంభించారు. తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాదయాత్ర ముగిసింది.

అమరావతి రాజధానిగా కొనసాగించాలని
దానికి కొనసాగింపుగా తమ ఉద్యమ, పాదయాత్రల ఉద్దేశాలను, రాష్ట్రానికి అమరావతి రాజధాని అవసరాన్ని ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈ సభ నిర్వహించనున్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం అది కేవలం 29 గ్రామాలు.. ఒక వర్గానికి చెందిన ఉద్యమంగా ఆరోపిస్తున్నారు. తాజాగా, ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును శాసనసభలో ఉప సంహరించుకుంది. ఇక, ఈ సభకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

చంద్రబాబుతో సహా బీజేపీ - జనసేన సైతం
టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత మహోద్యమ సభలో పాల్గొంటారు. టీడీపీఅధినేత చంద్రబాబు పర్యటన ఖరారు కాగా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు హాజరవుతారని ఆయా పార్టీల వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. జనసేన నుంచి పీఏసీ సభ్యులు హరిప్రసాద్..తిరుపతి నాయకుడు ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్.. కాంగ్రెస్ నుంచి మస్తాన్ వళీ, రైతు సంఘాల నాయకులు హాజరు కానున్నారు.

కొత్త సమీకరణాలకు వేదికగా
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు వర్చ్యువల్ గా ఈ సమావేశంలో పాల్గొంటారని చెబుతున్నారు. తాను సభకు హాజరు కావాలని భావించినా..వైసీపీ నేతలు తన పైన దాడికి దిగే అవకాశం ఉందనే సమాచారం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు ఇతర పక్షాలను కలుపుకొని..అమరావతి కోసం పోరాటం కొనసాగింపుతో పాటుగా.. వైసీపీకి వ్యతిరేకంగా అందరినీ ఒక తాటి పైన తీసుకొచ్చేందుకు ఈ సభ ద్వారా ప్రయత్నాలు ప్రారంభిస్తారని చెబుతున్నారు.

ఒకే రాజధాని..ఒకటే నినాదంతో పార్టీలు
ప్రధానంగా అమరావతి రాజధానిగా పరిరక్షణ కోసం ఈ పార్టీలన్నింటితో కలిపి రాజకీయ ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక, ఇదే సమయంలో అటు రాయలసీమలో మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తిరుపతి కేంద్రంగా... ఈ సభ నిర్వహణ.. నేతల ప్రసంగాలు..భవిష్యత్ కార్యాచరణ పైన ఆసక్తి పెరుగుతోంది. హైకోర్టు నిర్దేశించిన కండీషన్లను అమలు చేస్తూ ఈ సభ కొనసాగనుంది. రాయలసీమలో నిర్వహిస్తున్న అమరావతికి మద్దతు సభ కావటంతో రాజకీయంగానూ దీని పైన ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications