హైద్రాబాద్‌లో వద్దని చెప్పి అమరావతి వచ్చా: బాబు, గోదావరి జిల్లాలతో రాయలసీమకు పోటీ!
చిత్తూరు: హైదరాబాదులో ఉండి పాలించడం సరికాదనే ఉద్దేశ్యంతోనే తాను ఏపీ రాజధాని అమరావతికి వచ్చానని, ఇక్కడి నుంచి పాలన చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు అన్నారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలోని జిఆర్ఆర్ సమావేశ మందిరంలో టిడిపి దిశా నిర్దేశ సదస్సు ప్రారంభమైంది. టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.
కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రెండ్రోజులపాటు సదస్సు జరగనుంది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. నేను హైదరాబాదులో ఉండటం సరికాదనే ఉద్దేశ్యంతో అమరావతి నుంచి పని చేసేందుకు సిద్ధపడ్డానని తెలిపారు. విభజన వల్ల ఏపీకి 16వేల కోట్ల లోటు బడ్జెట్ వచ్చిందన్నారు. ఆదాయం పెంచేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని చెప్పారు. విభజనతో మనం నష్టపోయామన్నారు.
2029 కల్లా భారత్‌తో అత్యంత శక్తిమంతమైన రాష్ట్రంగా ఏపీ ఉండాలన్నారు. హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. ప్రజల మనోభావాలను మనం గౌరవించాలన్నారు. నాయకులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలన్నారు. నీరు - చెట్టు నిరంతరం కనిపించాలన్నారు.
ప్రజలు ప్రజాప్రతినిధులను గమనిస్తున్నారని చెప్పారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామన్నారు. పార్టీని ప్రజలకు అనుసంధానం చేస్తూ ముందుకెళ్లాలన్నారు. ఏపీకి ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చామన్నారు. హైదరాబాదులో ఉంటే ప్రజల తీర్పును అవమానించినట్లవుతుందని తాను వచ్చానని తెలిపారు.

సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. జూన్ నాటికి హంద్రీనీవా ద్వారా చిత్తూరుకు నీరు అందిస్తామని చెప్పారు. రెండేళ్లలో గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. రాయలసీమకు సాగునీరు అందిస్తే గోదావరి జిల్లాలకు పోటీగా పంటలు పండిస్తారన్నారు.
బాబు వ్యాఖ్యలతో టిడిపి కార్యకర్తలు చప్పట్లు కొట్టారు. ఇరిగేషన్ కోసం 15 నెలల్లో 9వేల కోట్లు ఖర్చు చేశామని, మరో మూడువేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. నీరు - చెట్టు కార్యక్రమ ఫలితం ఎస్పీఎస్ నెల్లూరు, చిత్తూరు, కడప తదితర జిల్లాల్లో కనిపిస్తోందన్నారు.
ప్రతిపక్షాలపై ఆగ్రహం
కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో వర్షాలు కాస్త బెటర్‌గా ఉన్నా డ్యాంలు నిండలేదని వాపోయారు. ప్రతిపక్షాల మాటలు దారుణంగా ఉన్నాయన్నారు. విపక్షాలు అన్నింటిని రాజకీయం చేయడం దౌర్భాగ్యం అన్నారు.
రాజకీయ నిరుద్యోగులను నమ్మొద్దు: కళా వెంకట్రావు
ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించబోతున్నామని ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. రాజకీయ నిరుద్యోగుల మాటలు ఏమాత్రం నమ్మవద్దని ఆయన చెప్పారు.
శ్రీవారి సేవలో ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప
అంతకుముందు, తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న చిన రాజప్పకు తితిదే అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.












Click it and Unblock the Notifications