‘బాబుకి బుద్ధి లేదు.. బాలయ్యకి సిగ్గు లేదు.. లోకేష్‌కి బుర్రే..’: ఏపీ మంత్రి ఏకేశారు
అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

బాబు, బాలయ్య, లోకేష్‌పై అంబటి రాంబాబు విమర్శలు
'చంద్రబాబుకి బుద్ధి లేదు.. బాలయ్యకి సిగ్గు లేదు.. లోకేష్ కి బుర్రే.... లేదు!' అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ఆయన ట్వీట్ కు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అది టీడీపీ వాళ్లకు తెలిసిన విషయమే కదా.. మళ్లీ ఎందుకు గుర్తు చేస్తున్నారు సార్ అంటూ పలువురు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. అయితే, కొందరు టీడీపీ మద్దతుదారులు ఇందుకు కౌంటర్లు ఇస్తున్నారు.

సిగ్గులేదయ్యా బాలయ్య అంబూ అంబటి రాంబాబు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై బాలకృష్ణ వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టిన క్రమంలోనూ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. 'కష్టంలో తండ్రిపై ప్రేమ చూపని బాలయ్యా !
నీకు సిగ్గులేదయ్యా!'.. 'జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య ..!' అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇతర మంత్రులు, వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఎన్టీఆర్‌పై దాడిశెట్టి రాజా తీవ్ర విమర్శలు
ఇది ఇలావుండగా, మంత్రి దాడిశెట్టి రాజా ఏకంగా దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీఆర్‌పైనే సంచలన విమర్శలు చేశారు. సీఎంగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆయన చేతిలో రాష్ట్రం ఉండగా.. మంత్రివర్గ సభ్యుడైన నాదెండ్ల భాస్కర్ రావుతో ఒకసారి, అల్లుడు చంద్రబాబుతో మరోసారి ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిపించుకున్నారని దాడిశెట్టి ఆరోపించారు. ఎన్టీఆర్ అంత చేతకానివాడు ఎవరూ ఉండరని విమర్శించారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఎన్టీఆర్‌కు.. వైయస్సార్ కు పోలికే లేదని.. వైయస్సార్ ప్రజల మనిషి అని మంత్రి దాడిశెట్టి వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల పాదయాత్రపైనా ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. తొడలు కొట్టుకుంటూ నాట్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా మంత్రి దాడిశెట్టిపై విమర్శలు దాడి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications