సిగ్గుంటే రా!: కేశవ్‌కి అంబటి, నీ వల్లే... పవన్ కళ్యాణ్‌ను లాగిన రోజా
హైదరాబాద్/విజయవాడ: తాను మగాడిలా భూములు కొన్నానని, జగన్ మగాడైతే రాజధానిలో చర్చకు రావాలని టిడిపి నేత పయ్యావుల కేశవ్ చేసిన సవాల్ పైన వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం నాడు స్పందించారు. తాము టిడిపి నేతలు, పయ్యావుల సవాల్‌ను స్వీకరిస్తున్నామని అంబటి చెప్పారు.
బినామీ లెక్కలన్నీ తేల్చేస్తామన్నారు. ప్రకాశం బ్యారేజీ పైన అయినా, పట్టిసీమ పైన అయినా చర్చకు సిద్ధమని పయ్యావుల సవాల్‌కు ప్రతి సవాల్ చేశారు. పయ్యావులకు చీము, నెత్తురు, లజ్జ ఉంటే, దమ్ముంటే ఉరవకొండలోనైనా సిద్ధమన్నారు. టిడిపి నేతల బినామీ ఆస్తుల పైన విచారణ కోరాలన్నారు.
పవన్ కళ్యాణ్‌ను లాగిన రోజా!

అమరావతిలో తెలుగుదేశం పార్టీ నేతల భూదందాపై జనసేన పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్ పోరాడాలని రోజా విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై నోరుమెదపాలన్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను చూసే ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారన్నారు.
విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసం అక్రమ కట్టడమని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో రెవెన్యూ మంత్రిని తప్పించి మంత్రి పుల్లారావు, నారాయణకు ఎందుకు బాధ్యతలు అప్పగించారో చెప్పాలని నిలదీశారు.
భూదందా చేయకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్లో సంబంధిత రికార్డులు ఎందుకు తొలగించారన్నారు. నారాయణ కాలేజీ సిబ్బంది మాత్రమే రాజధాని ప్రాంతంలో భూములు ఎలా కొన్నారని, మిగతా కాలేజీ సిబ్బంది ఎందుకు కొనలేకపోయారో చెప్పాలని అన్నారు.












Click it and Unblock the Notifications