ఏపీలో వైసీపీపై ప్రజా వ్యతిరేకత-టీడీపీతోనూ కలవబోం-అమిత్ షా క్లారిటీ-జగన్, చంద్రబాబుకు షాక్
ఏపీలో అధికార వైసీపీతో కేంద్రం సత్సంబంధాలు కొనసాగిస్తోందని, అదే సమయంలో అవసరాన్ని బట్టి టీడీపీతోనూ కలిసి అడుగులేసేందుకు సిద్ధమవుతోందన్న ప్రచారాలకు అమిత్ షా ఇవాళ చెక్ పెట్టేశారు. ఏపీలో ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని, అలాగే టీడీపీతో సమానదూరం కొనసాగించాలని బీజేపీ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అదే సమయంలో మిషన్ 2024 కోసం బీజేపీ భవిష్యత్ కార్యాచరణపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

అమిత్ షా తిరుపతి టూర్
దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటీ కోసం తిరుపతి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పనిలో పనిగా ఏపీ బీజేపీ తాజా పరిస్ధితిపై దాదాపు గంటన్నర సేపు ఇవాళ రివ్యూ చేశారు. అందులో బీజేపీ నేతల నుంచి స్ధానికంగా ఉండే ఇన్ పుట్స్ ను తీసుకున్న అమిత్ షా వాటిని తనకున్న ఇన్ ఫుట్స్ తో మ్యాచ్ చేస్తూ వారికి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఏపీలో మారబోతున్న పరిస్ధితులపై బీజేపీ నేతలకు ఆయన సంకేతాలు ఇచ్చారు. నేతలు చేయాల్సిన కార్యక్రమాల్ని కూడా సూచించారు. వీటిని తూచా తప్పకుండా పాటించేందుకు బీజేపీ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

వైసీపీ, టీడీపీపై కీలక వ్యాఖ్యలు
ఏపీలో అధికార, విపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీ మధ్య వివాదాలతో రాజకీయంగా ఫోకస్ అంతా వారి చుట్టూనే కేంద్రీకృతమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల నుంచి తమపైకి ఫోకస్ ఎలా లాక్కోవాలన్న అంశంపై అమిత్ షా బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో ఆయన ఇరు పార్టీలతో బీజేపీ నేతలు వ్యవహరించాల్సిన తీరుపైనా దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతానికి వైసీపీతో బీజేపీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తున్నా ఇవాళ అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో మాత్రం గ్యాప్ పెరుగుతోందని అర్ధమవుతోంది. అదే సమయంలో టీడీపీ విషయంలోనూ అమిత్ షా తాజా వైఖరి తేటతెల్లమైంది.

ప్రజా వ్యతిరేకతన్న అమిత్ షా
ఇన్నాళ్లు రాష్ట్రంలో అధికార వైసీపీతో కేంద్రం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోందని అంతా భావిస్తున్న తరుణంలో హోంమంత్రి అమిత్ షా ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని నేతలకు వెల్లడించారు. తనకున్న సమాచారం మేరకు ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ బీజేపీకి చెందిన రాష్ట్రస్ధాయి నేతలు సోము వీర్రాజు, సీఎం రమేష్, సుజనా చౌదరి నుంచి కూడా ఆయన ఇన్ పుట్స్ తీసుకున్నారు. వైసీపీతో వ్యవహరించాల్సిన తీరుపై అమిత్ షా వారికి దిశానిర్దేశం చేశారు. వైసీపీపై బీజేపీ పోరు కొనసాగించాల్సిందేనని వారికి సూచించారు.

టీడీపీతో సమానదూరం పాటించాలన్న షా
ఏపీలో ఒకప్పుడు అధికారపక్షంగా ఉంటూ తమ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఆ తర్వాత మారిన పరిస్ధితుల్లో విపక్షంలోకి వెళ్లిపోయింది. దీంతో అధికారంలో ఉన్నప్పుడు తమను టార్గెట్ చేసిన టీడీపీపై అమిత్ షాకు ఇంకా కోపం తగ్గలేదని అమిత్ షా ఇవాళ చేసిన వ్యాఖ్యలు నిరూపించాయి. ఏపీ బీజేపీ నేతల భేటీలో అమిత్ షా వారిని టీడీపీతో వైసీపీలాగే సమానదూరం పాటించాలని సూచించారు. తమ దృష్టిలో వైసీపీ, టీడీపీ సమామనే అని షా వారికి చెప్పినట్లు తెలుస్తోంది. అంటే వైసీపీ తరహాలోనే టీడీపీపైనా తమ పోరు కొనసాగించాలని నేతలకు తెలిపారు.
Recommended Video

జగన్ నిలదీసిన మరునాడే అమిత్ షా వ్యాఖ్యలు
నిన్న తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ అమిత్ షాను కడిగిపారేశారు. కేంద్రం నుంచి ఈ ఏడేళ్లలో వచ్చిందేమీ లేదన్నారు. విభజన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. ప్రత్యేక హోదా సహా ఏ విషయంనూ కేంద్రం నుంచి సహకారం లేదన్నారు. డిస్కంలకు నష్టాల భర్తీతో పాటు తెలంగాణ నుంచి కరెంటు బకాయిలు ఇప్పించడంలోనూ, జల వివాదాల పరిష్కారంలోనూ కేంద్రం చొరవ లేదన్నారు. దీంతో అమిత్ షా ఇరుకునపడ్డారు. జగన్ ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవకముందే ఏపీలో ప్రజావ్యతికత పెరుగుతుందంటూ అమిత్ షా బీజేపీ నేతలకు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ, టీడీపీ ఇద్దరితోనూ సమానదూరం పాటించాలని కోరడం వెనుక ఏం జరిగిందన్న చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications