చంద్రబాబుపై పోరుకు ఉవ్విళ్లు: కళ్లెం వేసిన అమిత్ షా
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై పోరుకు ఆంధ్రప్రదేశ్‌లోని బిజెపి నాయుకుల్లోని ఓ వర్గం ఉవ్విళ్లూరుతుంటే, దానికి పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కళ్లెం వేసినట్లు కనిపిస్తోంది. పార్టీని విస్తరించడానికి ప్రభుత్వంపై ఉద్యమాలు చేయాలని ఓ వర్గం సూచిస్తే, మరో వర్గం మాత్రం వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు అవసరమని, అందుకు పోరాటాలు చేయడం సరి కాదని వాదించినట్లు సమాచారం. బిజెపిలో మొదటి నుంచి ఉంటున్న నాయకులు చంద్రబాబుతో స్నేహానికి కట్టుబడి ఉందామని చెప్పగా, కొత్తగా చేరినవారు మాత్రం పోరాటాలకు శ్రీకారం చుడుదామని అన్నట్లు సమాచారం. వారి వాదనలను శ్రద్ధగా విన్న అమిత్ షా పోరాటాలకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.
2019 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ బలోపేతమే ధ్యేయంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం నవ్యాంధ్రలో పర్యటించారు. పార్టీ పదాదికారులతో విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్ఠత, సభ్యత్వ నమోదు, పార్టీల్లోకి వలసలు తదితర అంశాలపై చర్చించారు. పట్టణాలకే పరిమితమైన బిజెపిని గ్రామాలకు కూడా విస్తరించాలని దిశానిర్దేశం చేశారు. నవ్యాంధ్రలోని ఒక్కో పోలింగ్ బూత్‌లో వంద మంది కార్యకర్తలు ఉండేలా చూడాలని, రాష్ట్రం మొత్తంమీద 45 లక్షల సభ్యత్వాలను చేర్పించాలని ఆదేశించారు.

టిడిపితో పొత్తును కొనసాగిస్తూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని అమిత్ షా చెప్పారు. టిడిపితో ఉన్న సమస్యలేమిటి, ఆ పార్టీతో సమన్వయం ఎలా ఉందనే విషయాలను ఆయన ఆరా తీసినట్లు సమాచారం. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మిత్ర పక్షంగా ఉన్న టీడీపీ పాలనపై పార్టీ శ్రేణుల నుంచి సమాచారం సేకరించారు. అందుకు ఆయన రాష్ట్ర పదాదికారులు, కార్యవర్గం, విజయవాడ సిటీ నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. టీడీపీ పాలనతో పాటు రెండు పార్టీల మధ్య ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకు రావాలని కోరారు. అవసరమైతే ఆ విషయాలపై చంద్రబాబుతో మాట్లాడతానని చెప్పారు.
చంద్రబాబు తనతో మూడుసార్లు మాట్లాడారని, కానీ రాష్ట్ర పార్టీ నాయకులు ఎవరు కూడా తన దృష్టికి ఎటువంటి సమస్యలూ తీసుకురాలేదని, దాంతో ఆయన వద్ద వాటిని ప్రస్తావించలేకపోయానని చెప్పారు. దీంతో మూడు నాలుగు అంశాలను పార్టీ నేతలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి విషయంలో టిడిపి ప్రభుత్వం ఒకింత నిర్లక్ష్యాన్ని చూపుతోందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.శాంతారెడ్డి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి ప్రస్తావించినట్లు తెలిసింది.
రాయలసీమలో అత్యధిక స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారని, ఇది కూడా కొంత వరకు రాయలసీమ విషయంలో టిడిపి నిర్లక్ష్యానికి కారణమని చెప్పారు. దీనిపై బీజేపీ దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకుని రాయలసీమ అభివృద్ధికి కేంద్రం పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అనంతపురంలో జాతీయ శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ వద్ద ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న ఎత్తిపోతలపై యువమోర్చా ప్రధాన కార్యదర్శి యెనిమిరెడ్డి మాలకొండయ్య అమిత్ షాకు వినతి పత్రం ఇచ్చారు. దీంతో రైతులకు జరగనున్న అన్యాయాన్ని వివరించారు. గ్రామ స్థాయిలో ఐదుగురితో టిడిపి ఏర్పాటు చేసిన కమిటీల్లోనూ బిజెపికికి ప్రాధాన్యం ఇవ్వలేదనే విషయాన్ని కొంతమంది అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు. బిజెపి ఎమ్మెల్యేలున్న చోట కమిటీల్లో టిడిపి కార్య కర్తలకు అవకాశం కల్పించిన ప్రభుత్వం టిడిపి ఎమ్మెల్యేలున్న చోట మాత్రం బీజేపీ కార్యకర్తలకు చోటు కల్పించలేదన్నారు. వీటిపై ఇలా ఒకేసారి అన్ని విషయాలనూ చెప్పడం కన్నా ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సమస్యలను లిఖితపూర్వకంగా తీసుకు రావాలని సూచించారు.
రుణ మాఫీ, పింఛన్ల పంపిణీ వంటి పలు పథకాల అమల్లో జరుగుతున్న లోపాలపై బీజేపీ ఉద్యమ పంథా చేపట్టాలని ఇటీవల పార్టీలో చేరిన కొంతమంది నేతలు సమావేశంలో సూచించారు. దానిని అమిత్ షా తిరస్కరించారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ అదే ప్రభుత్వంపై పోరాటం చేయడం మంచిది కాదని, ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు కలిపి ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. లోపాలను ప్రభుత్వంతో ముఖ్యంగా చంద్రబాబుతో చర్చించడం మంచిదని సూచించారు.
పార్టీ ముఖ్యులలో పురందరేశ్వరి, ఒకరిద్దరు ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలను ప్రస్తావించినట్లు తెలిసింది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలని చెప్పుకొంటూ ప్రచారం చేసుకుంటోందని, దీనిపై తాము వ్యాఖ్యానించినప్పుడు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారని అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. దేన్నీ పట్టించుకోనవసరం లేదని, ముందుకు సాగాలని అమిత్ షా చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications