Amaravati: 65వేల కోట్లతో అమరావతి రాజధాని-నిధులు ఇలా- అసెంబ్లీలో ప్రకటన..!
ఏపీ రాజధాని అమరావతిని ఈ ఐదేళ్లలోనే పూర్తి చేయాలని భావిస్తున్న కూటమి సర్కార్ వేగంగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గతంలో ఇచ్చిన అనుమతులు, టెండర్లను సవరించి కొత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో అమరావతి నిర్మాణంపై క్రమంగా క్లారిటీ వస్తోంది. ఇవాళ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ ఇచ్చిన సమాధానంలో అమరావతిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.64,721.48 కోట్లుగా తేల్చినట్లు మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. మూడేళ్లలో అంటే 2028నాటికి అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)లో ఇళ్లు,భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం రూ.64,721.48 కోట్లు ఖర్చవుతుందని ఆయన తెలిపారు. ఈ నిధుల్ని వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.

బహుళ పక్ష ఏజెన్సీలు,బ్యాంకుల నుండి లోన్ లు,కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంటులను పొందడం ద్వారా నిధుల సేకరణ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లను దశల వారీగా మూడేళ్లలో అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2019-24 మధ్య విధానపరమైన అనిశ్చితుల కారణంగా ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నమ్మకంతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలు రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని,
తెలిపారు.
అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలని జగన్ ఇదే అసెంబ్లీ సాక్షిగా చెప్పారని మంత్రి గుర్తుచేశారు.ప్రభుత్వం మారగానే ప్లేటు ఫిరాయించి మూడు ముక్కలాట ఆడి ఎక్కడా రాజధాని చేయలేదన్నారు. గత ఐదేళ్లలో రాజధాని కి భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులు పెట్టారన్నారు. ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా అమరావతి ఉండాలని సీఎం చంద్రబాబు రాజధానిని డిజైన్ చేసారన్నారు. కానీ శాడిజంతో, కక్ష సాధింపుతో ఆర్ -5 జోన్ చేసి 50వేల మందికి ఒక సెంట్ భూమి ఇచ్చారన్నారు. వారికి కూడా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామన్నారు. వారికి తప్పకుండా న్యాయం చేస్తామన్నారు.

రాజధానికి వరల్డ్ బ్యాంకు,ఏడీబీ బ్యాంకు కలిపి రూ.13,400 కోట్ల రుణం ఇస్తున్నాయని మంత్రి తెలిపారు. KFW బ్యాంకు 5 వేల కోట్లు లోన్ ఇస్తుందని, హడ్కో నుంచి 11000 కోట్లు రుణం రెండు మూడు రోజుల్లో వస్తుందని మంత్రి వెల్లడించారు. కేంద్రం గ్రాంట్ కింద 1560 కోట్లు ఇస్తుందన్నారు. భూములు అమ్మడం ద్వారా,అలాగే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవడం ద్వారా మిగిలిన నిధులు సమీకరిస్తామన్నారు.
అమరావతిలో 106 ప్రభుత్వ,ప్రభుత్వేతర రంగ సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటుచేసేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. అమరావతిలో మెయిన్ రోడ్లు 165 అడుగులు,185 అడుగులతో రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఎల్పీఎస్ రోడ్లు మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలు ఏడాదిన్నరలో, మిగతావి రెండేళ్లు, అసెంబ్లీ, సెక్రటేరియట్,హైకోర్టు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. 2014-19 మధ్యలో అమరావతిలో 131 సంస్థలకు 1277 ఎకరాలు కేటాయించామని, గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలతో కొన్ని సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయని మంత్రి నారాయణ తెలిపారు.












Click it and Unblock the Notifications