Guntur: గుంటూరు జీజీహెచ్‍లో 8 రోజుల శిశువును కిడ్నాప్..
తిరుపతిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన మరవక ముందే గుంటూరులో ఆస్పత్రిలో ఓ శిశువు అపహరణకు గురైంది. పట్టపగలే 8 రోజుల శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. పొన్నూరు రోడ్డులోని సుబ్బయ్య కాలనీకి చెందిన రోషిని డెలవరీ కోసం గుంటూరు జీజీహెచ్ కు వచ్చారు. ఆమె సెప్టెంబర్ 31న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాతి రోజు ఆమెను 106వ వార్డుకు తరలించారు. బాలింతలు ఎక్కువగా ఉండడంతో ఒక్కో బెడ్ పై ఇద్దరిని పడుకోబెట్టారు.
మంగళవారం మధ్యాహ్నం రోషిని తన బిడ్డను పక్కలో వేసుకుని పడుకున్నారు. మధ్యలో మెలుకువ వచ్చి లేచేసారికి తన కుమార్తె కనిపించ లేదు. దీంతో ఆమె కేకలు వేయడంతో భద్రత సిబ్బంది వచ్చారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించారు. శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ దృశ్యాలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. శిశువును ఎత్తుకెళ్లిన మహిళ ఆస్పత్రి బయట ఆటో ఎక్కి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

ఆస్పత్రిలోకి రోగుల సహాయకులుగా కొంతమంది వచ్చి ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్ తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. రోజూ ఆసుపత్రికి సుమారు 3 వేల మందికి పైగా ఓపీ, 1600 మందికి పైగా ఇన్ పేషంట్లు వస్తారని పేర్కొన్నారు. గతంలోనూ జీజీహెచ్‌లో ఇటువంటి సంఘటనలు జరిగినా రక్షణ చర్యలు పటిష్ఠపర్చకపోవడం ఆందోళన అంశం. సదరు మహిళ అదును చూసి శిశువును ఎత్తుకెళ్లిన పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి శిశువు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
సోమవారం రాత్రి తిరుపతి బస్టాండ్ లో రెండేళ్ల బాలుడిని ఎత్తుకెళ్లారు. పోలీసులు గంటల వ్యవధిలోనే బాలుడిని రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. బాలుడిని ఎత్తుకెళ్లిన వ్యక్తిని సుధాకర్ గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications