నా డెత్ సర్టిఫికెట్ ఏ రాష్ట్రంలోనో: మంత్రి ఆనం
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై సీమాంధ్రకు చెందిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ఏ రకంకానూ ఏ ప్రాంతానికీ మంచిది కాదని, తాను పూర్తిగా విభజనను వ్యతిరేకిస్తున్నానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013పై ఆయన స్పీకర్ మనోహర్‌కు అందజేసిన అఫిడవిడ్‌లో విభజనపై తన ఆవేదనను వ్యక్తం చేశారు.
తాను ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో పుట్టానని, మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్‌లో చదివినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చదివినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని, 60 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో జీవిస్తున్నానని, విభజన జరిగి రాష్ట్రం రెండుగా విడిపోతే, నా డెత్ సర్టిఫికెట్ ఏ రాష్ట్రం నుంచి వస్తుందో? ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని అని ఆయన అన్నారు.

నీలం సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎన్టీరామారావు హైదరాబాద్‌ను రాజధాని కేంద్రంగా 57 ఏళ్లపాటు ఎంతగానో అభివృద్ధి చేశారని, విభజన పేరుతో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే ఇన్నాళ్ల కృషి, అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితమవుతాయని, ఇలాంటి వ్యవస్థలను మళ్లీ ఏర్పాటు చేసుకోవాలంటే మరో 60 ఏళ్లు పట్టవచ్చునని, ఫలితంగా రెండు, మూడు తరాలకు భవిష్యత్తు లేకుండా పోతుందనిఆయన అన్నారు.
ఇతర పార్టీలు విభజనపై నిర్ణయం తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పై నిర్ణయం తీసుకుందని, కానీ తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తూ తమ పార్టీని విమర్శిస్తున్నాయని ఆయన అన్నారు. విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి, చివరి ఆర్థిక మంత్రులు నెల్లూరు జిల్లా వారనే రికార్డు మిగులుతుందని ఆన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే చేపట్టాల్సిన పనులపై ఆయన సూచనలు కూడా చేశారు.












Click it and Unblock the Notifications