చోటా మోటా లీడర్‌లా ఆరోపణలు: దినేష్ రెడ్డిపై ఆనం ఫైర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ డిజిపి దినేష్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు. దినేష్ రెడ్డిపై ఆయన మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. గ్రామస్థాయి చోటామోటా లీడర్‌లా దినేష్ రెడ్డి మాట్లాడారని ఆయన అన్నారు. డిజిపిగా చేసిన వ్యక్తి మాట్లాడే పద్ధతి అది కాదని ఆయన అన్నారు. దినేష్ రెడ్డి ఆరోపణలు సరి కాదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి మీద దినేష్ రెడ్డి అవాకులు చెవాకులు పేలారని ఆయన అన్నారు. మావోయిస్టుల విషయంలో ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి మీద కక్ష సాధించడానికే అలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే దినేష్ రెడ్డికి డిజిపిగా అవకాశం వచ్చిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసి దినేష్ రెడ్డి తన స్థాయిని తగ్గించుకున్నారని ఆనం అన్నారు.

ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వకపోతే దినేష్ రెడ్డి డిజిపి అయ్యేవారు కాదని ఆయన అన్నారు. దినేష్ రెడ్డికన్నా సీనియర్లు అయిన నందన్, గౌతం కుమార్, శివశంకర్, ఉమేష్ కుమార్‌లను కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దినేష్ రెడ్డికి డిజిపిగా అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు. పదవీకాలం వారికి తక్కువగా ఉందని చెప్పి, ఐదో స్థానంలో ఉన్న దినేష్ రెడ్డికి డిజిపిగా అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు.
మొదటి నలుగురికి సర్వీసు తక్కువగా ఉండడంతో కేంద్ర సర్వీస్ రూల్స్‌ను, సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని దినేష్ రెడ్డికి డిజిపిగా అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు. కుట్రతో తనను డిజిపిగా తీసేశారని దినేష్ రెడ్డి అనడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. కుట్ర అనే పదం వాడడాన్ని ఆయన వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి కుమారుడిపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన సవాల్ చేశారు. సిబిఐ ముందు దినేష్ రెడ్డి దోషిగా నిలబడ్డారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా దినేష్ రెడ్డికి వ్యతిరేకంగా నిర్ణయం వెలువరించిందని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications