కేశినేని చిన్ని, చంద్రబాబు బాగోతం అంతా తెలుసు
Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- విజయవాడ రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే టికెట్ ఖరారైన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా పర్యటిస్తోన్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గడపగడపకూ వెళ్తోన్నారు.
తెలుగుదేశం పార్టీ, లోక్‌సభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన వైఎస్ఆర్సీపీ నేత కేశినేని నాని.. తన నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ప్రజలను కలుస్తోన్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటోన్నారు. బైక్ ర్యాలీలతో హోరెత్తిస్తోన్నారు.

తాజాగా విజయవాడ ఈస్ట్‌లో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో దేవినేని అవినాష్‌తో కలిసి పాల్గొన్నారు కేశినేని నాని. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. విజయవాడ లోక్‌సభ సీటును ఆశిస్తోన్న టీడీపీ నాయకుడు కేశినేని చిన్నినీ వదల్లేదు. పరోక్షంగా సెటైర్లు సంధించారు.
ఇంతకుముందే ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కు చంద్రబాబు ఇంటర్వ్యూ ఇచ్చాడని, ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకొంటానంటూ చంద్రబాబు చెప్పాడని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీకి గానీ, చంద్రబాబుకు గానీ ఇవే చివరి ఎన్నికలనే విషయాన్ని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, దాన్ని ఇప్పుడు ఆయనే అంగీకరించారని వ్యాఖ్యానించారు.

ఓడిపోతామని తెలిసీ..కోట్ల రూపాయలకు లోక్‌సభ, అసెంబ్లీ టికెట్లను చంద్రబాబు అమ్ముకుంటున్నాడని, అలా టికెట్లు కొన్నవారు ప్రజల ముందే తిరుగుతున్నారని చెప్పారు. ప్రజాదరణకు దూరమైన నాయకులు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి టికెట్లు కొన్నా.. వారికి పరాజయం తప్పదని పేర్కొన్నారు. గద్దె రామ్మోహన్ ఈ సారి ఓడిపోవడం ఖాయమని, 25,000 ఓట్ల మెజారిటీతో దేవినేని అవినాష్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారాయన.
తాను అమరావతిని అభివృద్ధి చేశానని, ఎయిర్ పోర్టులు కట్టానంటూ భ్రమల్లో పడి చంద్రబాబు తృప్తి పొందుతున్నాడని నాని సెటైర్లు వేశారు. ఎలాంటి ముందు చూపూ లేకుండా అసలు అమరావతి ప్రాంతాన్ని నాశనం చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ధిని అడ్డుకున్నారని, ఇక్కడి నిధులన్నింటినీ అక్కడికి తరలించాడని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications