జగన్ రెండో బహిరంగ సభ ఎప్పుడు? ఎక్కడ?: ఆ సీట్లపై కన్ను
Andhra Assembly elections 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపత్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమౌతోన్నారు.
విశాఖపట్నం జిల్లా భీమిలీలో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు. క్యాడర్‌లో ఎన్నికల ఊపును తీసుకొచ్చారు. జోష్‌ను నింపారు. ఎన్నికల కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసేలా చేసింది.

ఉత్తరాంధ్ర జిల్లాలపై వైఎస్ఆర్సీపీ సత్తాకు అద్దం పట్టింది ఈ సభ. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి లక్షలాది మంది ఈ సభకు తరలివచ్చారు. భీమిలీ మొత్తం జనసంద్రమైంది. జన సమీకరణలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు సక్సెస్ అయ్యారు. ప్రత్యేక వాహనాల ద్వారా వారిని భీమిలీకి తరలించగలిగారు.
దీనికి కొనసాగింపుగా రెండో బహిరంగ సభను ప్లాన్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఈ సారి కోస్తా జిల్లాలపై దృష్టి పెట్టింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో రెండో బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఉత్తర కోస్తా జిల్లాలకు ముఖ ద్వారంగా భావించే ఏలూరులో సిద్ధం పేరుతో రెండో బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది.

కాపు, క్షత్రియ సామాజిక వర్గ ఓటుబ్యాంకు అధికంగా ఉండే ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై ఈ సభ సానుకూల ప్రభావం చూపుతుందని వైస్ఆర్సీపీ అంచనా వేస్తోంది.
నిజానికి ఈ నెల 30వ తేదీ నాడే ఈ సభను నిర్వహించాలని తొలుత భావించింది వైఎస్ఆర్సీపీ. అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది. భీమిలీ సభను మించి పోయే రేంజ్‌లో దీన్ని నిర్వహించడానికి చకచకా ఏర్పాట్లు సాగిస్తోంది. సభా వేదిక ప్రదేశాన్ని జిల్లా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి కార్యక్రమాల కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈ సాయంత్రం పరిశీలించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications