ఎన్నికల వేళ.. వైసీపీకి పోటీగా
Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు విడతల్లో 68 లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. షెడ్యూల్ వెలువడటానికి, పోలింగ్ తేదీకి మధ్య సుమారు 40 రోజుల వరకు వ్యవధి ఉంటుందని, జనసేనతో సీట్ల పంపకాల వ్యవహారాన్ని కూడా అప్పుడే తేల్చేయాలని టీడీపీ భావిస్తోంది.

ఈ క్రమంలో జనసేన ఓ అడుగు ముందుకేసింది. జోనల్ కమిటీలను ప్రకటించింది. ఎన్నికల కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిన బాధ్యతను ఈ కమిటీలకు అప్పగించింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ-1, రాయలసీమ-2 వారీగా ఈ జోనల్ కమిటీలను ఏర్పాటు చేసింది.
వాటికి కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యలను అపాయింట్ చేసింది. తెలుగుదేశం- జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంటింటి ప్రచారాన్ని చేపట్టడం, బహిరంగసభలు, రోడ్ షోల నిర్వహణ, వాటికి అవసరమైన జనసమీకరణ, ఆ పార్టీల సీనియర్ నేతల షెడ్యూళ్లకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించడం.. వంటి పనులను ఈ కమిటీలు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ఉత్తరాంధ్ర జోన్ కన్వీనర్లుగా తోట సత్యనారాయణ, ఎస్ విష్వక్సేన్, వబ్బిన సత్యనారాయణ నియమితులయ్యారు. గోదావరి జోన్- రాఘవయ్య చౌదరి, రత్నం అయ్యప్ప, చాగంటి మురళీకృష్ణ, తలాటం సత్య, సెంట్రల్ ఆంధ్రా- బాడిగ శంకర్, కందా అమర్‌నాథ్, అనిల్ కుమార్, చీకటి వంశదీప్ అపాయింట్ అయ్యారు.
రాయలసీమ జోన్- 1లో కొట్టే వెంకటేశ్వర్లు, కేతుబోయిన సురేష్ బాబు, జోగినేని మణి, పగడాల మురళీ, రాయలసీమ జోన్- 2లో భవానీ రవి కుమార్, పీ పవన్ కుమార్.. కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఇదివరకే వైఎస్ఆర్సీపీ జోనల్ కన్వీనర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అదే దారిలో జనసేన నడిచినట్టయింది.












Click it and Unblock the Notifications