గ్రామీణ నేపథ్యంతో సంక్రాంతికి జనం ముందుకు జగన్ సినిమా..!!
Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడు విడతల్లో 59 మంది లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. షెడ్యూల్ వెలువడటానికి, పోలింగ్ తేదీకి మధ్య సుమారు 40 రోజుల వరకు వ్యవధి ఉంటుందని, జనసేనతో సీట్ల పంపకాల వ్యవహారాన్ని కూడా అప్పుడే తేల్చేయాలని టీడీపీ భావిస్తోంది.

అభ్యర్థుల ఎంపిక విషయంలోనే కాదు.. ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్ఆర్సీపీ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తోంది. మిగిలిన పార్టీల కంటే ఓ నాలుగడుగులు ముందే ఉంది. అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకాల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు మల్లగుల్లాలు పడుతోండగా.. వైసీపీ మాత్రం ఈ రెండింటినీ ఏకకాలంలో పూర్తి చేస్తోంది.
తాజాగా ఎన్నికల డిజిటల్ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్సీపీ. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాలపై గట్టి పట్టు ఉన్నట్లుగా భావిస్తోన్న నేపథ్యంలో- అక్కడే తన బలాన్ని నిరూపించుకునేలా ఈ డిజిటల్ క్యాంపెయిన్‌ను మొదలుపెట్టింది.
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక.. గ్రామీణ ప్రాంతాల్లో చోటు చేసుకున్న అభివృద్ధిని చిత్రీకరిస్తూ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ఇది.ఊరు మారింది అని దీనికి పేరు పెట్టారు. నాడు-నేడు కింద గ్రామాల్లో నిర్మించిన పాఠశాలలు, డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ పరిజ్ఞానంతో విద్యను బోధించడం వంటివి ఇందులో చిత్రీకరించారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావాల్సిన అన్ని అవసరాలను తీర్చడం, విలేజ్ క్లినిక్స్, గ్రామీణ సచివాలయాలు, ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ.. వంటి అంశాలన్నింటినీ ఇందులో పొందుపర్చారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను వైఎస్ఆర్సీపీ కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.












Click it and Unblock the Notifications