నేటి నుంచి ఏపీ అసెంబ్లీ- బడ్జెట్ తేదీలో అనూహ్య మార్పు..!!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఆరంభం కానున్నాయి. 16వ తేదీన ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ సమావేశాలను ప్రవేశపెట్టనున్నారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమౌతుంది. ఎన్నిరోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనేది ఇందులో ఖరారు చేస్తుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తాయి. అందుకే దీన్ని కీలకంగా భావిస్తోంది జగన్ ప్రభుత్వం.

రూ.2.60 లక్షల కోట్లతో..
2023-24 ఆర్థిక సంవత్సరానికి 2.60 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గత ఏడాది కంటే కూడా ఈ దఫా కేటాయింపులు భారీగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడం, మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలింపు.. వంటి అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

18 కాదు..
ఇదివరకు ఈ నెల 18వ తేదీన బడ్జెట్ ను ప్రతిపాదనలను సభకు సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకున్నాయి. 18కి బదులుగా 16వ తేదీ నాడే బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్- వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తారు. దీని తరువాత రెండు రోజుల పాటు సభకు సెలవు ఉంటుందని చెబుతున్నారు.

సంక్షేమానికే..
ఈ సారి కూడా సంక్షేమ పథకాలకు అధిక మొత్తంలో కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన ప్రభుత్వం- ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. పింఛన్ మొత్తాన్ని కూడా 3,000 రూపాయలకు పెంచాల్సి ఉన్నందున దీనికి అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు ఉండొచ్చు.

వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల్లో సంక్షేమానికి..
వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు బడ్జెట్‌లో అధిక కేటాయింపులు ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన.. వంటి పథకాలను అమలు చేస్తోన్నందున విద్యారంగానికి బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. వ్యవసాయం, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, వైద్య కళాశాలల నిర్మాణానికి మరిన్ని నిధులను కేటాయిస్తారని చెబుతున్నారు.

మూడు రాజధానులపై..
దీనితో పాటు అత్యంత కీలకమైన మూడు రాజధానులపైనా వైఎస్ జగన్ ఓ స్పష్టమైన ప్రకటన చేస్తారని అంటున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నందున- విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించే ప్రక్రియలో ఎలాంటి జాప్యం చేయకూడదని భావిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిటీషన్లు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ నెల 28వ తేదీన వాటిపై మలి విడత విచారణ చేపట్టనుంది ధర్మాసనం.












Click it and Unblock the Notifications