ఏపీలో నేడు కూడా..కంట్రోల్ రూమ్ నంబర్లు
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ జిల్లాల వరకూ భారీ వర్షాలు దంచికొట్టాయి. ప్రత్యేకించి- రాయలసీమలో అత్యధిక వర్షపాతం నమోదైంది. నేడు కూడా వర్షాల తీవ్రత కొనసాగనుంది. ఎగువ, పరీవాహక ప్రాంతంలో తాజాగా భారీ వర్షాలు పడటం వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని దాల్చింది. శ్రీశైలం రిజర్వాయర్ కు వరదజలాలు పోటెత్తుతున్నాయి.
వాయువ్య- దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఈ వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీరాన్ని దాటింది. అనంతరం ఇది దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా క్రమంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.

దీని ప్రభావం నేడు కూడా కొనసాగనుంది. ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం, రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
ధవళేశ్వరం వద్ద గోదావరి ఇన్ ఫ్లో 10.88 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. వచ్చిన వరద జలాలను వచ్చినట్టే దిగువకు వదిలివేస్తోన్నారు. అవుట్ ఫ్లో కూడా 10.88 లక్షల క్యూసెక్కులుగా ఉంటోంది. కృష్ణా ప్రకాశం బ్యారేజి వద్ద కూడా భారీగా ఇన్ ఫ్లో- అవుట్ ఫ్లో రికార్డయింది. ఇక్కడ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.09 లక్షల క్యూసెక్కులు. ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ 112, 1070, 18004250101 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయకూడదని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కోరారు.












Click it and Unblock the Notifications