దారుణ మోసం: బాబుపై మోదుగుల, పల్లె 'పొలిటికల్' వార్నింగ్, జలీల్ ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ టిడిపిలో చిచ్చు రేపుతోంది. పలువురు ఆశావహులు తమకు చోటు దక్కక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలు అలకబూనారు.

దారుణంగా మోసం చేసారు: మోదుగుల
పార్టీ మారిన వాళ్లకు, నాలుగుసార్లు ఓడిపోయిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మండిపడ్డారు. కన్నా లక్ష్మీ నారాయణపై గెలిస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. చివరకు దారుణంగా మోసం చేశారన్నారు. ఎంపీగా ఉన్న తనను ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పారని మోదుగుల ఆవేదన వ్యక్తం చేశారు.

మైనార్టీల్లో అలజడి
మైనార్టీలకు కేబినెట్లో చోటు లేకపోవడం దారుణమని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. ఆయన వైసిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన మంత్రి పదవి కారణంగానే టిడిపిలో చేరినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆయనకు దక్కలేదు. దీనిపై జలీల్ ఖాన్ మాట్లాడారు. మైనార్టీలకు పదవి ఇవ్వకపోవడం తీవ్ర అవమానం అన్నారు. 12 శాతం ఉన్న మైనార్టీలకు ఇవ్వకపోవడం ఏమిటన్నారు. సీఎం తలుచుకుంటే మైనార్టీలకు పదవి ఇవ్వవచ్చునని చెప్పారు. ఈ సందర్భంగా జలీల్ ఖాన్.. మైనార్టీ సంఘాలు, అనుచరులతో భేటీ అయ్యారు.

బొజ్జల బాధ్యత సోమిరెడ్డికి
తనను పదవి నుంచి తప్పించడంపై బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయనతో చంద్రబాబు మాట్లాడారు. ఆయనను బుజ్జగించారు. బొజ్జలను బుజ్జగించే బాధ్యతను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అప్పగించారు. ఆ తర్వాత బొజ్జల తగ్గినట్లుగా కనిపిస్తోంది.
టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర కూడా అసంతృప్తికి గురయ్యారు. ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. అయిదుసార్లు గెలిచిన దూళిపాళ్లకు మంత్రి పదవి ఇవ్వకపోడవంతో.. ఆయన పార్టీని వీడాలని అనుచరులు డిమాండ్ చేశారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటానని పల్లె
పల్లె రఘునాథ్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆయనను మంత్రి పరిటాల సునీత, మండలి బుద్ధప్రసాద్‌లు బుజ్జగిస్తున్నారు. తనను మంత్రి పదవి నుంచి తప్పించడం కలచివేసిందని, తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని పల్లె హెచ్చరించారు.
పలాస ఎమ్మెల్యే శివాజీ కూడా తనకు మంత్రి పదవి దక్కనందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆయనకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మద్దతుగా నిలిచారు. తాను మరో పార్టీలో చేరబోనని చింతమనేని ప్రకటించారు.












Click it and Unblock the Notifications