నాగార్జున, భూమి: రాజధాని అటు.. ఆలోచన వెనుక..!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ - గుంటూరు మధ్య.. మంగళగిరిలో ఉంటుందని, అమరావతి కేంద్రంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తొలుత కృష్ణా - గుంటూరు మధ్యనే రాజధాని రావొచ్చునని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు పలుమార్లు చెప్పారు. రాజధాని లిస్టులో నిన్నటి వరకు గుంటూరు - విజయవాడ మధ్య వినిపించగా.. తాజాగా అమరావతి పేరు వినిపిస్తోంది.
మంగళగిరిలో ఉంటుందని తొలుత భావించినా.. భూముల ధరలు చుక్కలు అంటుతుండటంతో అక్కడి నుండి అమరావతి వైపు వెళ్లే ఆలోచన చేస్తుండవచ్చునని అంటున్నారు. మంగళగిరి ప్రాంతంలో ఒక గజం విలువ ఇప్పటికే 30 వేల నుండి 40 వేలు దాటిపోయింది. ఈ పరిస్థితుల్లో అతి సామాన్యుడు 40 గజాల స్థలంలో సొంత గూడు ఏర్పర్చుకునే పరిస్థితి లేదనే చెప్పాలి.

అలాగే మంగళగిరిలోని నాగార్జున విశ్వవిద్యాలయం వెనుక వైపు ఉన్న నంబూరు, లామ్ తదితర ప్రాంతాల్లో సారవంతమైన భూములు ఉన్నాయి. అందుకే వద్దనుకుంటున్నారట. అదే సమయంలో నాగార్జున విశ్వవిద్యాలయాన్ని కదిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి పెద్దగా ఆసక్తి లేదని అంటున్నారు. దీంతో అమరావతి కేంద్రంగా రాజధాని కోసం ఆలోచన చేస్తున్నారని అంటన్నారు.
అమరావతి కేంద్రంగా రాజధానిని ఏర్పాటు చేసి.. కృష్ణా జిల్లాలోని ప్రాంతాలను కొత్త రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతాన్ని కలుపుతూ పలు భారీ వంతెనలు నిర్మిస్తే విజయవాడ నుండి దూరం తగ్గుతుందని భావిస్తున్నారు. నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెదే అవకాశాలు ఉంటాయి. దీంతో ఒక పెద్ద రాజధాని నిర్మాణం అవుతుందని భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications