ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు: ఐదుగురి అరెస్ట్, సీజేఐ వ్యాఖ్యలతో కదిలిన సీబీఐ
అమరావతి: సోషల్ మీడియాలో ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచేలా పోస్టులు చేసిన ఐదుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. శనివారం పీ ఆదర్శ్, ఎల్ సాంబశివరెడ్డిని అధికారులు అరెస్ట్ చేయగా, జులై 28న దామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్‌ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ దిగువ కోర్టు న్యాయమూర్తులు ఫిర్యాదు చేయగా దీనిపై విచారణ చేస్తున్న సీబీఐ ఈ అరెస్టులు చేసింది.
జులై 9న ఈ కేసులో నిందితుడిగా ఉన్న లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని కువైట్ నుంచి వస్తుండగా అరెస్ట్ చేసినట్లు సీబీఐ తెలిపింది. శనివారం అరెస్టైన ఆదర్శ్, సాంబశివరెడ్డిలను కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 16 మందిపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఈ కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ నందిగాం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. మొత్తం 16 మందిలో ముగ్గురు విదేశాల్లో ఉన్నారని చెప్పారు.

ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలతోపాటు ఎఫ్ఐఆర్‌లో ఉన్న వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అధికారులు తెలిపారు. ఆ తర్వాత లీగల్ చర్యలు తీసుకుంటామన్నారు. జడ్జీలపై వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్లు సీబీఐ అధికార ప్రతినిధి ఆర్సీ జోషీ తెలిపారు.
న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసులో విచారణ జరపాలని, పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సీబీఐకి ఏపీ హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. కాగా, దేశంలో న్యాయాధికారులపై దాడులు, దూషణలు అధికం కావడంపై శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలో బెయిల్ ఇవ్వలేదనే కోపంతో ఉత్తమ్ ఆనంద్ అనే న్యాయమూర్తిని నిందితులు ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు చాలా తీవ్రమైనవని అన్నారు. అంతేగా, ఈ విషయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లు న్యాయవ్యవస్థకు సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల రక్షణకు సంబందించిన పిటిషన్‌పై వారం రోజుల్లోగా స్పందించాలని కేంద్రాన్ని కోరారు. తాను బాధ్యతతోనే ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, సీబీఐ అధికారులు అరెస్టు ప్రకటన చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications