వాలంటీర్లకు సీఎం జగన్ బంపర్ ఆఫర్
ఏపీలో ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరమైన సంగతి తెలిసిందే. పింఛన్ల పంపిణీకి కూడా వీరిని దూరంగా ఉంచాలని, వాలంటీర్లద్వారా నగదు పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పింఛనుదారులంతా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు కొందరు వాలంటీర్లు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఇటువంటి తరుణంలోనే ముఖ్యమంత్రి జగన్ వారికి శుభవార్తను వినిపించారు.
చిత్తూరు జిల్లా నాయుడుపేటలో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతోందని, తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే పెడుతున్నానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇప్పుడున్న పథకాలన్నీ అమలు చేస్తామన్నారు. మేనిఫెస్టోలో లేనివాటిని కూడా సాధ్యమైనంతవరకు పథకాలను ఇంటింటికీ అందజేస్తామన్నారు.

చంద్రబాబునాయుడులా తాను మోసపూరితమైన హామీలు, అబద్ధాలు చెప్పనని, 2014 ఎన్నికల్లో హామీలంటూ ఫొటోలు, సంతకాలతో ప్రతి ఇంటికీ కరపత్రాలు పంపిణీ చేశారన్నారు. చంద్రబాబువన్నీ వెన్నుపోట్లు, కుట్రలు, మోసాలు, కుతంత్రాలేనని ఎద్దేవా చేశారు. తన అనేవారంతా బాబుకు నాన్ లోకల్ అని, పొత్తులు, జిత్తులతో పనిలేకుండా ఇంటింటికీ మంచి చేశామని జగన్ అన్నారు. చంద్రబాబు కిచిడీ మేనిఫెస్టోతో తాను పోటీపడదలుచుకోలేదన్నారు.
వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం కావాలనే నగదును ఇంటింటికీ పంపిణీ చేయకుండా ఎత్తుగడలకు పాల్పడుతోందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ విమర్శిస్తున్నాయి. చంద్రబాబువల్లే పింఛన్లు ఇంటింటికీ అందడంలేదంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది.












Click it and Unblock the Notifications