ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు సారథ్యంలో అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటిల్లో కొన్ని కొత్తవిగా కాగా, మరికొన్ని గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవే. వాటినే తిరిగి కొనసాగిస్తున్నారు. ఈ పథకాల అమల్లో సాధ్యాసాధ్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు. తాజాగా మహిళలకు చంద్రబాబునాయుడు మరో వరం ప్రకటించారు. వడ్డీ లేకుండా రూ.10 లక్షల రుణాన్ని వారికి మంజూరు చేయబోతున్నారు. ఆర్థికంగా వారు ఎదిగేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
డ్వాక్రా సంఘాల్లోని మహిళలకే
డ్వాక్రా సంఘాల్లోని మహిళలకే ఈ రుణాన్ని అందజేస్తున్నారు. వడ్డీ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతోపాటు ఏపీలో మహిళలకు మరో పథకం కూడా అమలు కాబోతోంది. ఆడబిడ్డ పథకం కింద 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసులోపు మహిళలకు నెలకు రూ.1500 అందివ్వబోతోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఇది కూడా ఒకటి. దీని అమలుపై సాధ్యాసాధ్యాలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ పథకం అమలయ్యేలోపే స్త్రీలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి దీన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

నెలకు ఇస్తారా? ఏడాదికి ఇస్తారా?
నెలకు రూ.1500 చొప్పున ప్రతి నెలా అందిస్తారా? లేదంటే ఒకేసారి సంవత్సరానికి రూ.18వేలు ఇస్తారా? మొత్తం సొమ్ములను మూడు వాయిదాల్లో చెల్లిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. కానీ 2019 నుంచి 24 మధ్యకాలంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను భారీగా అమలు చేయడంతోపాటు వాటికి ప్రాధాన్యతనిస్తూనే ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఆడపిల్లలు చదువుకునేందుకు కలలకు రెక్కలు పథకం, తల్లికి వందనం పేరుతో సంవత్సరానికి రూ.15వేల చొప్పున అందిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించాలి.. అందరూ కష్టపడి పనిచేసుకొని సంపాదించాలని చెప్పే చంద్రబాబునాయుడు కూడా చివరకు సంక్షేమ పథకాలవైపు మొగ్గుచూపుతున్నారంటే అవి ప్రజల్లో తీసుకువచ్చిన మార్పును అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications