విశాఖపట్నంకు మరో శుభవార్తను ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవలే విశాఖపట్నంలో పర్యటించిన సందర్భంగా డిజైన్ కు సంబంధించి కొన్ని మార్పు చేర్పులను అధికారులకు సూచించారు. స్తంభాల చుట్టుకొలత పెంచడంతోపాటు కొన్నింటిని అదనంగా నిర్మించడం, వంతెనల పొడవు, వెడ్పుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
nhaiకి, మెట్రోకు ఉపయోగపడేలా
విశాఖ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(nhai) 12 ఫ్లైఓవర్లను నిర్మించబోతోంది. ఈ ఫ్లైఓవర్లకు అనుగుణంగా డిజైన్ లో మార్పుచేర్పులుండాలని ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీంతో మెట్రోకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక లో(dpr) కొన్ని మార్పులు చేయబోతున్నారు. nhaiకి, మెట్రోకు రెండింటికీ ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. nhai వంతెనలను నిర్మించిన తర్వాత మళ్లీ వంతెనలు నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీ హయాంలో 140 కిలోమీటర్ల
వైసీపీ హయాంలో విజయవాడలో ఉన్న మెట్రో కార్యాలయాన్ని విశాఖకు తరలించారు. ఈ ప్రాజెక్టుపై 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రీబిడ్ నిర్వహించగా ఐదు సంస్థలు ఆసక్తి చూపించాయి. ఎస్సెల్ ఇన్ ఫ్రా కన్సార్టియం ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేయగా.. తర్వాత ఎన్నికలు రావడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ ప్రక్రియ మొత్తం ఆగిపోయింది.
2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అనకాపల్లి నుంచి భోగాపురం వరకు 140 కిలోమీటర్లు మెట్రో నిర్మించాలని డీపీఆర్ మార్చింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 46 కిలోమీటర్ల మేరకు ముందుగా మెట్రో నిర్మాణం చేపట్టి, తర్వాత భోగాపురం విమానాశ్రయానికి విస్తరించాలనే యోచనలో ఉంది.












Click it and Unblock the Notifications