సీఎం చంద్రబాబు భారీ శుభవార్త.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు నెలలో దీనికి సంబంధించి కీలక ప్రకటన రాబోతోంది. చెప్పిన విధంగా పెంచిన పింఛన్లను అందజేస్తున్నారు. మరోవైపు అన్న క్యాంటిన్లు అన్నిచోట్ల ప్రారంభమయ్యాయి. దశలవారీగా వీటిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.
విధివిధానాలపై దృష్టి
మహిళలకు ఉచిత ప్రయాణంపై విధివిధానాలను అధికారులు రూపొందిస్తున్నారు. దీనికంటే ముందుగా ప్రభుత్వం ఆర్టీసీకి 500 కొత్త బస్సులను కొనుగోలు చేసి వీటిని అన్ని జిల్లాలకు కేటాయించింది. ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న కడప ఆర్టీసీ జోన్ కు 250 బస్సులను అందజేయగా, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు మరో 250 బస్సులను కేటాయించింది. ఆర్టీసీకి కొత్త బస్సులను కొనుగోలు చేసి చాలాకాలం కావడంతో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం జోన్ కు ఈ 500 బస్సులకంటే ముందే కొనుగోలు చేసిన 100 బస్సులను కేటాయించారు.

ఆర్టీసీలో పెరగనున్న ఉపాధి అవకాశాలు
సొంత వాహనాలు తక్కువగా ఉండటంతో రద్దీగా ఉండే మార్గాల్లో అద్దె ప్రాతిపదికన బస్సులను ఆర్టీసీ నడిపిస్తోంది. ఇవి ప్రమాదానికి గురవుతుండటంతో బాధితులకు పరిహారం రూపేణా భారీగా ఖర్చవుతోంది. తాజాగా కొత్త బస్సులు రావడంతో అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త బస్సులవల్ల ఆర్టీసీలో ఉపాధి అవకాశాలు కూడా పెరగబోతున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ, కర్ణాటకలో ఆ పథకం అమలవుతున్న తీరును అధికారులు పర్యవేక్షించారు. దీనికి అనుగుణంగా నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. మొదటగా ఈ పథకాన్ని విశాఖపట్నం నుంచి ప్రారంభిస్తామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.












Click it and Unblock the Notifications