స్కూల్స్ చుట్టు పక్కల అవి ఎక్కడ కనిపించినా: టీచర్లకూ వార్నింగ్: ఎఎన్ఎంలకు కీలక బాధ్యతలు
అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. పాఠశాలల విషయంలో మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. నాడు-నేడు పథకంతో పాఠశాలల దశదిశను మార్చేసిన ప్రభుత్వం.. మరింత స్వచ్ఛమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకోవడానికి అనువైన పరిస్థితులను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించే చర్యలకు పూనుకుంది.
ఇందులో భాగంగా- రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల చుట్టు పక్కల ఎక్కడే గానీ గుట్కా, పాన్, సిగరెట్లను విక్రయించకూడదని ఆదేశించింది. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన సర్కులర్‌ను జారీ చేసింది. ఒక ప్రభుత్వ పాఠశాలకు కనీసం 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్లను విక్రయించే దుకాణాలు ఉండకూడదని స్పష్టం చేసింది. దీన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యతను ఏఎన్‌ఎంలకు అప్పగించింది. ఒక్కో ఏఎన్‌ఎంకు రెండు నుంచి మూడు పాఠశాలలకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అందజేసింది.

ఏఎన్‌ఎం తరచూ తమకు కేటాయించిన ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. వాటి సమీపంలో సిగరెట్లు, గుట్కా, పాన్ విక్రయాలపై నిఘా ఉంచాల్సి ఉంటుంది. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల చుట్టుపక్కల ఎవరైనా సిగరెట్, గుట్కా, పాన్‌లను విక్రయిస్తూ ఉంటే వాటికి సంబంధించిన ఫొటోలను ఈ యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఎఎన్ఎంలకు సూచించింది.

స్కూళ్లకు సమీపంలో సిగరెట్, గుట్కా, పాన్ దుకాణాలను నిర్వహించినా.. వాటిని విక్రయించినా కఠిన చర్యలను తీసుకుంటామని విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు హెచ్చరించారు. పాఠశాలల సమీపంలో మద్యం షాపులు ఉన్న, మద్యం సేవించినా వారిపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ఉపాధ్యాయులు, ఇతర పాఠశాల సిబ్బంది కూడా స్కూల్ ఆవరణలో పొగతాగడం, పాన్, గుట్కాను నమలడం చేస్తే వారిపైనా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. సిగరెట్, గుట్కా, పాన్ వంటి చెడు అలవాట ప్రభావం విద్యార్థులపై పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలను జారీ చేసినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications