ఏపీలో నీటి చుక్క కరవు.. భానుడి భగభగ
బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌కు సమీపంలో వాయుగుండం ఏర్పడినప్పటికీ ఏపీపై పెద్దగా ప్రభావం ఉండదని వాతావరణశాఖ ప్రకటించింది. మధ్యప్రదేశ్ పై మాత్రం కొంత ప్రభావం ఉండొచ్చని చెప్పింది. దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని, ఏపీలో లేవని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రానున్న ఐదురోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి.
అక్కడక్కడా జల్లులు
రాష్ట్రంలో అక్కడక్కడా జల్లులు పడతాయని అధికారులు వెల్లడించారు. మూడు రోజుల నుంచి తీర ప్రాంతాలకు సమీపంలోని పట్టణాలు, నగరాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. వేసవికాలంలో ఉండే వేడిని ఇవి తలపిస్తున్నాయి. రాత్రివేళ కూడా వాతావరణం వేడిగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. తేలికపాటి జల్లులు కురుస్తున్నప్పటికీ తర్వాతరోజు మరింత వేడి వాతావరణం ఉంటోంది. ఈరోజు రాత్రి పదిగంటల తర్వాత తూర్పు రాయలసీమతోపాటు తూర్పు తెలంగానలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

37 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రత
ఈదురు గాలులు వీస్తాయని, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటాయని, దక్షిణ భారతదేశంవైపు ఇవి దూసుకొస్తున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో మాత్రం ఉష్ణోగ్రత రోజురోజుకు పెరగనుంది. తీర ప్రాంతాల్లోని నగరాల్లో 37 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది. వానలు పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కురిసినా జల్లులు కురవడం.. దీనివల్ల భూమి వేడెక్కి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరో ఐదురోజులపాటు ఈతరహా వాతావరణం నెలకొనే ఉంటుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మాత్రం వేడికి మాడిపోతున్నారు. చుక్క కరవవడంతోపాటు రైతులు విత్తనాలు వేయకుండా వరుణుడి దయ కోసం ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications