రైల్వే జీఎంతో ఎంపీ జేసీ వాగ్వాదం: బహిష్కరించిన ఎంపీలు
అమరావతి: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాపై తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి పలు సూచనలు చేయాలంటూ గురువారం విజయవాడలోని రైల్వే కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సమవేశానికి జేసీ దివాకర్ రెడ్డితో పాటు ఎంపీలంతా హాజరయ్యారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్టేషన్లకు నిధులు కేటాయించలేనప్పుడు, కొత్త రైళ్లను కేటాయించనప్పుడు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేనప్పుడు ఈ సమావేశాలెందుకని ప్రశ్నించిన జేసీ, రైల్వే జీఎం రవీంద్ర గుప్తాతో వాగ్వాదానికి దిగారు.

అసలు రాష్ట్రానికి వచ్చిన నిధులెన్ని, ఎంత ఖర్చు చేశారని అధికారులను ప్రశ్నించారు. రూ.200 కోట్లు వచ్చాయని చెప్పడంతో జేసీ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై మిగతా ఎంపీలు తమ అభిప్రాయాలను తెలిపారు.
ఇతర ఎంపీలు చేసిన విజ్ఞప్తులకు సైతం అధికారులు సానుకూలంగా స్పందించలేదు. నిధులు లేవని రైల్వే జీఎంతో చెప్పడంతో ఎంపీలు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. సమావేశం ప్రారంభమైన అరగంటకే ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, తోట నర్సింహం, జేసీ దివాకర్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయారు.
అయితే, సమావేశం మాత్రం కొనసాగుతూనే ఉండటం విశేషం. అనంతరం బయటకు వచ్చిన ఎంపీలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్ట బోయేలోపు రైల్వే శాఖ మంత్రిని కలుస్తామని తెలిపారు. ఇది ఇలా ఉంటే, రైల్వే జీఎంతో బుధవారం తెలంగాణ ఎంపీలు సమావేశమయ్యారు. వారు కూడా రైల్వే జీఎం సమావేశాన్ని బహిష్కరించారు.












Click it and Unblock the Notifications