తండ్రి అయిన టాలీవుడ్ హీరో.. వారాసుడొచ్చాడోచ్ !!
టాలీవుడ్ హీరో నారా రోహిత్ ప్రమోషన్ పొందారు. ఆయన భార్య శిరీష ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వారి కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంది. దీంతో ఈ దంపతులకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా నారా రోహిత్, శిరీషల వివాహం గతేడాది అక్టోబర్ 30, 2025న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఈ జంట వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు పెద్దలుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే 'ప్రతినిధి 2' చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారగా.. పెద్దల అంగీకారంతో అక్టోబర్ 13, 2024న నిశ్చితార్థం చేసుకున్నారు.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు "నారా రోహిత్". సీఎం చంద్రబాబు సోదరుడి కుమారుడుగా గుర్తింపు పొందిన రోహిత్.. బాణం మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సోలో (2011), ప్రతినిధి (2014), రౌడి ఫెలో (2014), అసుర (2015), అప్పట్లో ఒకడుండేవాడు (2016) వంటి విలక్షణమైన చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
అలానే జ్యో అచ్యుతానంద, సావిత్రి, కథలో రాజకుమారి వంటి సినిమాలు కూడా ఆయన కెరీర్‌లో ప్రత్యేకస్థానం సంపాదించాయి. మొదటి నుంచి వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకున్నారు నారా రోహిత్. మధ్యలో సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చినా.. ఇటీవల భైరవం, సుందరకాండ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం నారా రోహిత్ పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' చిత్రంలో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా విడుదల కానున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ చిత్రంతో పాటు సోలో హీరోగా మరో ప్రాజెక్టులో కూడా ఆయన నటిస్తున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications