ఏపీకి మరో ముప్పు... హెచ్చరించిన వాతావరణశాఖ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ ముప్పు పొంచి ఉందా..? తుపాన్ రూపంలో మరో గండం రానుందా..? అనే సందేహం తాజాగా వెంటాడుతోంది. ఎందుకంటే డిసెంబర్ 16న బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడి..18వ తేదీకి అది అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మిగ్ జాం తుపానుతో తీవ్ర నష్టాల్లో ఉన్న తమను మళ్లీ అగాధంలోకి నెట్టేయడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాతావరణశాఖ వెదర్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం శ్రీలంక - తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతోందని, ఈ అల్పపీడనం భారీ తుఫాన్ గా మారబోతోందని హెచ్చరించింది. ఏపీవైపు ఈ తుఫాను రావడానికి 50 శాతం అవకాశం ఉందని, డిసెంబరు 21, 22, 23, 24, 25 తేదీల వరకు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత తుఫాను కన్నా ఈసారి భారీ ముప్పు సంభవించడానికి అవకాశం ఉందని, రైతులు తమ తమ పనులను డిసెంబరు 15వ తేదీకల్లా పూర్తిచేసుకోవాలని సూచిస్తున్నారు.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, వాయువ్య గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని వెల్లడించారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల.. ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురవడానికి అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో కూడా తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయని, రాయలసీమలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications