సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్: ఏం జరుగుతోంది, తాత్కాలిక సచివాలయం ఖర్చు అంతా?
అమరావతి: జూన్ 27 నాటికి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కేంద్రంగా పరిపాలన సాగించాలని యోచిస్తున్న ఏపీ ప్రభుత్వం మరో ముందుడగు వేసింది. జూన్ 27 నాటికి హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు పూర్తి చేయాలని బుధవారం సర్క్యులర్ జారీచేసింది.
అంతేకాదు జూన్ 27 నాటికి ఉద్యోగులందరూ అమరావతిలోని తాత్కాలిక సచివాలయానికి తరలిరావాలని అందులో పేర్కొంది. కాగా, వెలగపూడిలో ఏపీ ప్రభుత్వం తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని రూ. 180 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదనలు చేసినప్పుడు, తాత్కాలిక భవనం కోసం అంత ప్రజాధనమా? అంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.
ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా మరో 250 కోట్లతో దానిపైనే మరో రెండు అంతస్తులు నిర్మించాలని తీర్మానించింది. దీనిని బట్టి చూస్తే తాత్కాలిక సచివాలయానికి సుమారు 400 నుంచి 500 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

అంతేకాదు తాత్కాలిక సచివాలయంలోనే ప్రస్తుతానికి సచివాలయం, శాసనసభ, శాసనమండలి, వివిధ ప్రభుత్వ సంస్ధల కమిషనరేట్లను ఏర్పాటు చేస్తున్నందుకే అంత ఖర్చు పెట్టడంలో తప్పులేదని రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వం ఇన్నాళ్లు చెప్పుకొస్తుంది. అంతేకాదు రాజధాని అమరావతిని నిర్మించిన తర్వాత కూడా ఈ తాత్కాలిక సచివాలయాన్ని ప్రభుత్వం వేరే అవసరాలకు ఉపయోగించుకుంటుందని మంత్రి నారాయణ చెబుతున్నారు.
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ దానిపై మరో 370 కోట్లు ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఏసీలు, ఆఫీస్ ఫర్నీచర్ తదితర సామాగ్రి కొనుగోలు కోసం రూ. 250 కోట్లు, రహదారులు, మంచి నీళ్ళు, మురికి కాలువలు, తదితర మౌలిక వసతుల కల్పనకు రూ.120 కోట్లు కేటాయించినట్లు సమాచారం.
ఈ పనుల కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టెండర్లను పిలిచినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తుంటే తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు రూ. 870 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు అవుతుంది. ఈ మొత్తం కేంద్రం రాజధాని అమరావతి నిర్మాణం కోసం విడుదల చేసిన నిధుల్లో సగం కంటే ఎక్కువ.
ఇలా తాత్కాలిక సచివాలయానికే ఇన్ని వందల కోట్లు ఖర్చయితే రాజధాని ప్రాంతంలో నిర్మించే శాశ్వత భవనాలకు ఇంకెంత డబ్బు కావాలో ఊహిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. ఏపీ ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోందని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అంతేకాదు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులకు కూడా లెక్కలు చూపించలేదని, ఒక దానికి కేటాయించిన నిధులను మరో దాని కోసం వినియోగిస్తున్నారని కూడా చెబుతున్నారు. ఈ కారణం చేతనే కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని వాదిస్తున్నారు. అయితే అవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక తాత్కాలిక కట్టడంపై ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
అంతేకాదు రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు కూడా ఇంత వరకు న్యాయం చేయలేదు. కేంద్రం కూడా పెద్దగా సహకరించక పోవడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సచివాలయ నిర్మాణంపై అంత భారీ మొత్తంలో ఖర్చు పెడుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications