లాక్ డౌన్‌లో చిక్కుకుపోయారా.. మీకోసం జగన్ సర్కార్ టోల్ ఫ్రీ నంబర్స్.. తరలించే ఏర్పాట్లు..
లాక్ డౌన్ కారణంగా ఉన్నచోటే చిక్కుకుపోయిన వలస కార్మికులు,విద్యార్థులు,కూలీలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని స్వరాష్ట్రానికి రావాలని చూస్తున్న ఏపీ వాసుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 0866 2424680తో పాటు [email protected] అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం(ఏప్రిల్ 30) సాయంత్రం ఏపీ కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు ఈ వివరాలు వెల్లడించారు.
ఏపీ నుంచి స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వారి కోసం 1902 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలనుకుంటున్న వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే వారిని స్వస్థలాలకు పంపిస్తున్నామని అన్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారైనా.. రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవారైనా.. కరోనా పరీక్షల తర్వాతే వారిని అనుమతిస్తామని చెప్పారు.

ఇక రాష్ట్రంలోని గ్రీన్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గ్రీన్ జోన్లలో కార్మికులు,కూలీల అవసరం ఉంటే.. ఇతర గ్రీన్ జోన్ల నుంచి రప్పించుకోవచ్చునని తెలిపారు. గుజరాత్ నుంచి బయలుదేరిన మత్స్యకారులు శుక్రవారం రాష్ట్రానికి చేరుకుంటారని వెల్లడించారు.
కాగా, ఏపీలో గడిచిన 24 గంటల్లో 71 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1403కు చేరింది. కొత్త కేసుల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 43 కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 321 కరోనా పేషెంట్లు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 1051 యాక్టివ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications