దంచికొడుతున్న వానలు, దూసుకొస్తున్న రుతుపవనాలు.
ఏపీలోని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచే మబ్బులు పట్టిన ఆకాశం.. మధ్యాహ్నానికి వర్షంగా మారింది. నెల్లూరు, మార్కాపురం, తిరుపతి తదితర జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వాన దంచికొడుతోంది. కోస్తా, రాయలసీమలోని మిగతా జిల్లాల్లోనూ పలు చోట్ల ఆకాశం మేఘావృతమైంది. మరోవైపు తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి మరింతగా ముందుకు సాగుతున్నాయి. శనివారం (మే 30, 2026) అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, లక్షద్వీప్ దీవులు, కొమరిన్ ప్రాంతంతో పాటు బంగాళాఖాతంలోని మెజారిటీ ప్రాంతాల్లోకి విస్తరించాయి.
రాబోయే 4-5 రోజులలో ఇవి కేరళ, తమిళనాడు సహా మరికొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. వీటికి తోడు మధ్య పాకిస్థాన్ నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి, బంగాళాఖాతం నుంచి లక్షద్వీప్ వరకు మరొక ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

ఉత్తర కోస్తాంధ్ర & యానాం వాతావరణ సూచన:
ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిధిలో రాబోయే మూడు రోజుల పాటు (ఈరోజు, రేపు, ఎల్లుండి) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. అయితే, ఈరోజు, రేపు ఒకటి లేదా రెండు చోట్ల 'భారీ వర్షాలు' కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఒకటి లేదా రెండు చోట్ల వడగళ్ల వాన (వడగళ్లు పడే అవకాశం) కూడా కురవవచ్చని హెచ్చరించారు. ఈ మూడు రోజులూ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి.
దక్షిణ కోస్తాంధ్ర వాతావరణ సూచన:
దక్షిణ కోస్తా జిల్లాలలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రేపు, ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల జల్లులు పడవచ్చు. ఉత్తర కోస్తా తరహాలోనే ఇక్కడ కూడా ఈరోజు, రేపు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు దక్షిణ కోస్తాలోనూ ఒకటి లేదా రెండు చోట్ల వడగళ్లు పడే ప్రమాదం ఉంది. రాగల మూడు రోజుల పాటు గంటకు 50-60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురు గాలులు వీస్తూ, ఉరుములు మెరుపులు సంభవించవచ్చు.
రాయలసీమ వాతావరణ సూచన:
రాయలసీమ ప్రాంతంలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని, ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈరోజు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇక రేపు, ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. గాలి వేగం స్వల్పంగా తగ్గి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే వీలుంది. రాయలసీమలో ఈ మూడు రోజులూ ఉరుములు, మెరుపుల ప్రభావం ఉంటుంది.
ఉష్ణోగ్రతలలో మార్పులు (ఉపశమనం):
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రతపై వాతావరణ కేంద్రం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, యానాం పరిధిలో రాబోయే రెండు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో పెద్దగా మార్పు ఏమీ ఉండదు. అయితే, ఆ తదుపరి రోజుల్లో (మూడు రోజుల తర్వాత) ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గే అవకాశం ఉందని, తద్వారా ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.














Click it and Unblock the Notifications