రోళ్లు పగులుతున్నాయ్: సీమలో సెగలు, కోస్తాలో ఉక్కపోత
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ మిన్నంటుతోంది. మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా రాయలసీమలో ఎండలు ముదురుతుండగా, కోస్తాంధ్రలో ఉక్కపోత ఊపిరాడనీయడం లేదు. అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాగల రెండు రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎండ తీవ్రతకు తోడు వేడి గాలులు తోడవడంతో మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అటు కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరోలా ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో తేమ పెరిగింది. దీనివల్ల ఎండతో పాటు విపరీతమైన వేడి మరియు అసౌకర్యమైన ఉక్కపోత ప్రజలను ఇబ్బంది పెడుతోంది.

రానున్న మూడు రోజుల వాతావరణ సూచన:
- ఉత్తర కోస్తా & యానాం: ఈరోజు, రేపు పొడి వాతావరణంతో పాటు అక్కడక్కడ పొగమంచు కురిసే అవకాశం ఉంది. అయితే, ఎల్లుండి (మార్చి 8) ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
- దక్షిణ కోస్తా: రానున్న మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుంది. ఒకటి రెండు చోట్ల పొగమంచు కురిసే వీలుంది.
- రాయలసీమ: ఇక్కడ వర్ష సూచన ఏమాత్రం లేదు. రాబోయే మూడు రోజుల పాటు ఎండ తీవ్రత కొనసాగుతుంది.
గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు:
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున 36°C నుంచ 40°C మధ్య నమోదయ్యాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వేడి గాలుల కారణంగా జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications