మసకేసిన మబ్బులు.. ఏపీలో జల్లులు
రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పిడుగులతో కూడి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నాలుగు రోజులపాటు ఏపీలో పిడుగులతో కూడిన వానలు కురవనున్నాయి.
తేలికపాటి వర్షాలు..
గురువారం రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయి. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

రైతులు జాగ్రత్తగా ఉండాలి
ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, రైతు కూలీలు పొలాల్లో ఉండొద్దని, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు చెట్ల కింద తలదాచుకోవద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఓవైపు వాతావరణం ఇలా ఉంటే రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి.
తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 45.4 డిగ్రీలు, కర్నూలు జిల్లా పంచలింగాల, వైఎస్సార్ జిల్లా వల్లూరులో 45.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాడ్పులు కూడా వీస్తున్నాయని, ముఖ్యమైన పని ఉంటేనే ప్రజలు బయటకు వెళ్లాలని, లేని పక్షంలో ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు బయటకు రావొద్దని తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications