టీటీడీలో వైభవంగా ఉత్సవాలు ఆరంభం
TTD: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు కన్నుల పండువగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగుతాయి. 18వ తేదీన పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.
ఈ పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు తిరుచానూరు ఆలయ అర్చకులు. ఇందులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయంలో సంవత్సరం పొడవునా అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిపే పలు క్రతువుల్లో తెలియక దోషాలు జరుగుతుంటాయి. దీని దుష్ప్రభావాన్ని నివారించేలా ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఇటీవలే తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా పవిత్రోత్సవాలు వైభంగా ముగిశాయి.
తిరుచానూరు ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేడు పవిత్ర ప్రతిష్ఠ, 17వ తేదీన పవిత్ర సమర్పణ ఉంటుంది. 18వ తేదీన పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే సేవల్లో పాల్గొనదలిచిన భక్తులు ఒక్కొక్కరు 750 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించిన టికెట్లను ఇదివరకే ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. పవిత్రోత్సవాల అంకురార్పణ దృష్టిలో పెట్టకుని ఆదివారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు. నేడు అష్టదళ పాద పద్మారాధన సేవ ఉండదు. 17, 18వ తేదీలలో కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్ సేవను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications