టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉప ఎన్నిక - అన్నింటికీ ఒకే సమాధానం..!?
ఏపీలో ఉప ఎన్నిక రాబోతోందా. ఈ ఉప ఎన్నిక ద్వారా అన్నింటికీ సమాధానం ఇవ్వాలని అధికార వైసీపీ భావిస్తోందా. మరో ఏడాది నుంచి ఏడాదిన్నార లోగా ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో ఏపీలో ఉప ఎన్నికకు సంబంధించి చర్చ మొదలైంది. ఇందుకు విశాఖ నగరం వేదిక అయ్యే అవకాశం కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. ప్రధాని మోదీ విశాఖ పర్యటన వేళ మరోసారి ఈ అంశం తెర పైకి వచ్చింది.
ఇప్పటికే ఇదే అంశం పైన స్పీకర్ ఫార్మాట్ లో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామా లేఖ సమర్పించారు. స్వయంగా స్పీకర్ ను కలిసి ఆమోదించాలని కోరారు. దీని పైన ఇప్పటి వరకు నిర్ణయం జరగలేదు. తాజాగా, గంటా తన రాజీనామా ఆమోదించాలంటూ మరోసారి లేఖ రాసారు. ఈ సమయంలో విశాఖ కేంద్రంగా మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ మద్దతుతో ర్యాలీలు..సభలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే అభ్యర్ధన మేరకు రాజీనామా ఆమోదిస్తే ఉప ఎన్నిక ద్వారా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉందనే దాని పైన అధికార పార్టీ నేతల మధ్య చర్చ మొదలైంది. గంటా స్టీల్ ప్లాంట్ కోసం చేసిన రాజీనామా ఆమోదించాల్సిన పరిస్థితి వస్తే.. విశాఖ పరిపాలన రాజధానిగా డిమాండ్ చేస్తూ రాజీనామాకు ముందుకొచ్చిన ధర్మశ్రీ సైతం రాజీనామా చేసేందుకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది.

గంటా స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేయటంతో..ఆయన రాజీనామా ఆమోదించాల్సి వస్తే ఉప ఎన్నిక ఖాయం. బై పోల్ లో గంటా తిరిగి పోటీ చేస్తారా అనేది సందేహమే. గంటా తిరిగి పోటీ చేస్తే అక్కడ వైసీపీ తమ అభ్యర్ధిని పోటీకి దించుతుందా లేదా అనేది డౌటుగానే కనిపిస్తోంది. గంటా తిరిగి ఎన్నికైనా కొత్తగా టీడీపీ - వైసీపీకి వచ్చే లాభ-నష్టాలు లేవు. కానీ, అదే సమయంలో వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా ధర్మశ్రీ రాజీనామా కూడా ఆమోదిస్తే అప్పుడు మూడు రాజధానుల అంశం పైనే ప్రధానంగా ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు టీడీపీ - జనసేన లో ఎవరు పోటీలో ఉండాలనేది తేల్చుకోవాల్సి ఉంటుంది. ఆ రెండు పార్టీల పొత్తు పైన ఉప ఎన్నిక జరిగితే పార్టీల బలా బలాపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఉప ఎన్నిక అనివార్యమైతే ఫలితం ఎలా ఉంటుందనే స్పష్టతతో పాటుగా.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సమయంలో అన్ని రకాలుగా ఆలోచన చేసిన తరువాతనే నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు.
విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించాలని సీఎం భావిస్తున్న సమయంలో..విశాఖలో ఉప ఎన్నికల పైన విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతన్న చర్చ ఆసక్తి కరంగా మారుతోంది. ప్రధాని మోదీ విశాఖ బహిరంగ సభలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయం పైన ఏదైనా ప్రకటన చేస్తారా అనేది మరో కీలక అంశం. సీఎం జగన్ విశాఖ లో ప్రధాని పాల్గొనే సభలో దీని పైన మరోసారి ప్రధానిని స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచన విరమించుకోమని కోరే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధాని సానుకూల వ్యాఖ్యలు చేస్తే..గంటా రాజీనామా వ్యవహారం ఇంతటితో ముగిసే పోయే అవకాశం ఉంది. అయితే, ప్రధాని పర్యటన తరువాత ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం.. విశాఖ కేంద్రంగా చోటు చేసుకొనే రాజకీయం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications