విజయవాడకు మరో వరద హెచ్చరిక..! ఈ ప్రాంతాల్లో అలర్ట్ జారీ..
ఏపీలో తాజాగా వచ్చిన విజయవాడ వరదల్ని మర్చిపోకముందే మరోసారి వరద ముప్పు స్ధానికుల్ని భయపెడుతోంది. కృష్ణా నదిలో పెరుగుతున్న వరద ప్రవాహాలతో జనం అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటి మట్టాల్ని ఎప్పటిప్పుడు సమీక్షిస్తున్నారు. అందుకు అనుగుణంగా స్ధానికుల్ని అప్రమత్తం చేస్తున్నారు.
నిన్న బెజవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద 45 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం ఉన్నట్లు బ్యారేజ్ ఏఈ దినేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో గేట్లన్నీ ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. అయినా పై నుంచి క్రమంగా పెరుగుతున్న ప్రవాహాలతో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లి తహశీల్దార్ ఒక ప్రకటనలో కోరారు. మత్స్యకారులు నదిలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

గత నెలలో బెజవాడలో బుడమేరు పొంగడంతో అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. దీంతో లక్షల సంఖ్యలో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. అయితే ఇప్పుడు కృష్ణానదిలో వస్తున్న వరదల ప్రభావాన్ని రిటైనింగ్ వాల్ అడ్డుకుంటుందని భావిస్తున్నారు. అయితే భారీ ప్రవాహాలు వస్తే మాత్రం రిటైనింగ్ వాల్ దాటి కూడా వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తాడేపల్లి నుంచి కరకట్ట వెంబడి ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications