ఏపీలో రైతులకు మరో శుభవార్త.. వీటితో మీ పంట పండినట్టే!
ఏపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం ఏపీలో రైతుల సంక్షేమానికి కూడా కృషి చేస్తోంది. ఇప్పటికే రైతులకు అన్నదాత సుఖీభవ పథకంతో పంట పెట్టుబడులను అందించిన ఏపీ సర్కార్, తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూస్తోంది. తాజాగా రైతులకు మరో శుభవార్త చెప్పింది.
రాష్ట్ర వ్యాప్తంగా సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ
రైతుల సంక్షేమం కోసం భూసార పరీక్షల ఆధారంగా సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీని మొదలు పెట్టింది. భూముల భూసార పరీక్షలు రైతుల యొక్క పంట దిగుబడిని పెంచడానికి, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైతులకు ఈ కార్డులను అందించనుంది ఏపీ ప్రభుత్వం.

సాయిల్ హెల్త్ కార్డులతో లాభాలు ఇవే
ఈ సాయిల్ హెల్త్ కార్డులను అందించడం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం. దీనిని ఏపీలో 100% అమలుపరచడానికి ఏపీ సర్కార్ పనిచేస్తోంది. మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య పరీక్షలు ఎంత అవసరమో, భూమికి కూడా భూసార పరీక్షలు అంతే ముఖ్యం. ఈ పరీక్షల ద్వారా భూమిలో ఉన్న సారాన్ని, పోషకాల స్థాయిలను, లోపాలను తెలుసుకుంటారు.
సాయిల్ హెల్త్ కార్డులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
తద్వారా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు వ్యవసాయ శాఖాధికారులు ఇస్తారు. పంటల నాణ్యత, దిగుబడిని పెంచడం కోసం ఏం చేయాలి అన్న దానిపైన భూసార పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయి.గత ప్రభుత్వ హయాంలో భూసార పరీక్షల పైన అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గతంలో సేకరించిన నమూనాలను సైతం పరీక్షించి వాటి ఆధారంగా భూ ఆరోగ్య కార్డులను జారీ చేయడం మొదలుపెట్టింది.
రాష్ట్రంలోని ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డు
2025 2026 సంవత్సరానికి సంబంధించి ఈ సాయిల్ హెల్త్ కార్డులను రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఇవ్వడానికి ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. ఈ సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా రైతులు తమ భూమి స్వభావాన్ని అర్థం చేసుకుని దానికనుగుణంగా సరైన పంటలు, సరైన సాగు పద్ధతులను అనుసరిస్తే వ్యవసాయంలో దిగుబడి గణనీయంగా ఉంటుంది. ఇది రైతుల ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది.












Click it and Unblock the Notifications